ఏపీలో కొత్త సంవత్సరంతో పాటే మారనున్న డీజీపీ, సీఎస్‌.. మరి ఈ లిస్ట్‌లో ఉన్నది ఎవరు..?

|

Dec 24, 2024 | 8:40 AM

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు డిసెంబర్ నెలాఖరుతో రిటైర్ కాబోతున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే సీనియర్ల లిస్టును పరిశీలించిన ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబు పాతవారికే మరో అవకాశమిస్తారా? లేక ఎవరైనా కొత్తవారిని తీసుకొస్తారా? అనే ఆసక్తి నెలకుంది.

ఏపీలో కొత్త సంవత్సరంతో పాటే మారనున్న డీజీపీ, సీఎస్‌.. మరి ఈ లిస్ట్‌లో ఉన్నది ఎవరు..?
Cs Neerabh Kumar Dgp Dwaraka Tirumal Rao
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంవత్సరంతో పాటే.. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు కూడా రానున్నారు. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌, డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలతో పూర్తవుతుండడంతో.. కొత్త సీఎస్, డీజీపీ కోసం కసరత్తు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యాలను పకడ్బందీగా అమలు చేసే అధికారుల కోసం ఏపీ సీఎం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ లిస్ట్‌లో ఉన్నది ఎవరు..? వినిపిస్తున్న పేర్లు ఏంటి..? అన్నదీ ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు డిసెంబర్ నెలాఖరుకు రిటైర్ కాబోతున్నారు. సీఎస్ నీరబ్ కుమార్‌కు ఇప్పటికే పొడిగింపు ఇవ్వగా, మరోసారి ఛాన్స్ లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా రిటైర్ కాబోతున్నందున కొత్తగా మరో సీనియర్ ఐపీఎస్‌ను డీజీపీగా నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఛాయిస్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి నెలకుంది.

ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేస్తున్న సీఎస్ నీరబ్ కుమార్ ప్లేస్‌కోసం ముగ్గురు సీనియర్ అధికారులు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురిలో విజయానంద్, సాయి ప్రసాద్, ఆర్పీ సిసోడియా పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పదవీకాలం ఆధారంగా ఎవరిని నియమించాలనే విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో సాయిప్రసాద్, సిసోడియా 1991 బ్యాచ్ అధికారులు కాగా.. విజయానంద్ 1992 బ్యాచ్ అధికారి. ఇదే సీనియారిటీ లిస్టులో శ్రీలక్ష్మి, అనంతరాము పేర్లు ఉన్నాయి. కానీ, వీరిద్దరికి అవకాశం లేదని చెబుతున్నాయి. ప్రభుత్వ వర్గాలు. సీఎస్ రేసులో ఉన్న ముగ్గురిలో విజయానంద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న విజయానంద్‌కు.. ఏపీ చంద్రబాబు నాయుడుకు ఇష్టమైన అధికారుల్లో ఒకరిగా పేరుంది. అలాగే బీసీ సామాజికవర్గం, సొంతరాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం కూడా విజయానంద్‌కు కలిసొచ్చే అంశాలు.

ఇక, డీజీపీగా ఎవరిని నియమిస్తారనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఆరోపణలు రావడంతో అతని స్థానంలో హరీష్‌కుమార్‌ గుప్తాను నియమించింది ఎన్నికల సంఘం. చంద్రబాబు సీఎం అయ్యాక ద్వారకా తిరుమలరావు డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆరేడు నెలల్లో ప్రభుత్వం అప్పగించిన కీలక కేసులను సమర్థంగా తిరుమలరావు డీల్ చేశారు. అయితే డీజీపీ పదవీకాలం పొడిగించిన సందర్భం ఇంతవరకూ లేకపోవడంతో.. తిరుమలరావు స్థానంలో కొత్త డీజీపీ నియామకం తప్పకపోవచ్చంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

ఇదిలావుంటే, 1990 ఏపీ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్‌, అంజనీ సిన్హాలు కోర్టు ఉత్తర్వులతో ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. అందువల్ల వారికి అవకాశం లేనట్టే. దీంతో 1992 ఏపీ కేడర్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తాకే మళ్లీ అవకాశం దక్కవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఆయనకే అవకాశమిస్తారా? లేక ఎవరైనా కొత్తవారిని తీసుకొస్తారా? అనే ఆసక్తి నెలకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..