AP Assembly: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అసెంబ్లీ వేదికగా అల్లకల్లోలం

|

Jul 21, 2024 | 7:28 PM

ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. అమరావతిలో ఏర్పడ్డ ఈ వాయుగుండం.. సోమవారం అసెంబ్లీలో తీరం దాటనుంది. దీంతో అటు అధికార పక్షం.. ఇటు విపక్షం పూర్తిగా అలర్ట్‌ అయ్యాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు..వారి బలాబలాలను పూర్తిగా మోహరించాయి. మరి ఈ వాయుగుండం తీవ్రరూపం దాల్చి..తుఫానుగా మారుతుందా..? లేక అల్పపీడనంగా బలహీనపడి తుస్సుమంటుందా..?

AP Assembly: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అసెంబ్లీ వేదికగా అల్లకల్లోలం
Jagan Vs Chandrababu
Follow us on

ఏపీలో సభాసమరానికి వేళయింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు.. అయిదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. దీంతో మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. గవర్నర్ ప్రసంగంతో తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చిస్తారు.

ఎన్నికల హామీలపై సభలో ప్రశ్నిస్తామన్న వైసీపీ

సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అసెంబ్లీలో తొలిసారిగా కూటమి ప్రభుత్వాన్ని ఢీకొట్టనుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే అవకాశం లేదన్న చర్చ జరుగుతున్న వేళ.. వాటికి చెక్‌పెట్టింది ఆ పార్టీ. అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకోవడంతో పాటు రాష్ట్రంలోని కీలక అంశాలపై చర్చించేందుకు సిద్ధమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై..శాసనసభ వేదికగానే ప్రశ్నిస్తామని వైసీపీ ప్రకటించింది. అందులో భాగంగానే శాసనసభ సమావేశాలకు హాజరై తమ గొంతును వినిపించేందుకు వైసీపీ అధినేత తన ఎమ్మెల్యేలతో కలిసి సిద్ధమవుతున్నారు.

దాడులపై అసెంబ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న జగన్‌

అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించాలని భావిస్తున్నారు..వైసీపీ అధినేత. రాష్ట్రంలో నెలకున్న తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ నేతలు-శ్రేణులపై జరుగుతున్న దాడులపై అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్‌ భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను అసెంబ్లీలో గవర్నర్ ముందు వివరించాలని వైసీపీ భావిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై గవర్నర్‌ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే నిరసన తెలపాలని వైసీపీ అధినేత డిసైడ్‌ అయ్యారు. దాడులకు నిరసనగా గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు.

ఢిల్లీ వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం

గత నెలలో జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఈసారి సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు ఆయనే స్వయంగా తెరదించారు. ఈసారి అసెంబ్లీ సమావేసాల తొలిరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి తాను కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వినుకొండ పర్యటనలో జగన్ స్పష్టం చేశారు. అలాగే తన కామెంట్స్‌ ద్వారా సభలో వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతుందనేది ముందుగానే చెప్పేశారు..జగన్‌. అలాగే మంగళవారం ఢిల్లీకి తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తీసుకు వెళ్లాలని పార్టీ అధినేత భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై అసెంబ్లీతో పాటు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామని ఇప్పటికే ప్రకటించిన వైఎస్‌ జగన్‌..పార్లమెంట్‌లోనూ ఏపీలో పరిణామాలపై గళమెత్తాలని తన పార్టీ MPలకు స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి..ఏపీలో వరుసగా తమ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు.

వైసీపీ హయాంలో ఆర్థిక దోపిడీ జరిగిందంటున్న టీడీపీ

అటు ప్రభుత్వం కూడా అసెంబ్లీ వేదికగా వైసీపీని ఇరుకున పెట్టేందుకు..వ్యూహాలు రచిస్తోంది. జగన్‌ హయాంలో లెక్కలేనంతగా ఆర్థిక దోపిడి, విధ్వంసం జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ..వాటిని అసెంబ్లీలో ప్రజెంట్ చేసి విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం..మరో మూడు వైట్‌పేపర్స్‌ను సభలోనే ప్రవేశపెట్టనుంది. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలపై సభలోనే చర్చ పెట్టనున్నారు..ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుతో పాటు కీలక బిల్లులు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. వరదలు, రైతులకు సంబంధించిన అంశాలు, నీటి పారుదల వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

దాడులపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఇరుకున పెట్టాలని వైసీపీ భావిస్తున్న నేపథ్యంలో..అటు ప్రభుత్వం కూడా అందుకు సై అంటోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయంటున్న జగన్..దానిపై తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు హోంమంత్రి అనిత. జగన్‌ చేసిన ఆరోపణలు అవాస్తవం అయితే..ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలన్నారు.

జగన్‌ ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలన్నారు..జనసేన నేత నాగబాబు. పాత పగలతోనే వినుకొండలో మర్డర్‌ జరిగిందని..దానికి రాజకీయ రంగు పులమడానికి ట్రై చెయ్యొద్దన్నారు. జగన్‌కు ధైర్యముంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరై… అక్కడ మాట్లాడాలని సూచించారు.

అసెంబ్లీలో ప్రభుత్వానికి జగన్‌ కౌంటర్‌ ఇవ్వగలరా!

సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయింది..వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. దాంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. మరోవైపు గెలిచిన 11మందిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ జూనియర్లే. దీంతో కూటమి పార్టీ నేతల నుంచి వచ్చే కామెంట్స్‌కు జగన్‌ ఏ విధంగా కౌంటర్‌ ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు వైసీపీలా కాకుండా హుందాగా రాజకీయాలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎం చంద్రబాబు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు జగన్‌పై పరిధి దాటి విమర్శలు చేయకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..