ఏపీ సీఎం జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గకుండా తను ఏం చెప్పాడో..అది చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై సీఎం మరో కీలక అడుగు ముందుకు వేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం.. సాధారణ పరిపాలనశాఖ నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.దీనికి సంబంధించి డిసెంబర్ 1న కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయనున్నారు. అలాగే వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థ కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ముఖ్యమంత్రి చెబుతున్నారు. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాస్థాయిలో విభాగాలు.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నేతృత్వం, ఎక్స్ అఫిషియోగా కలెక్టర్ ఉంటారు.
మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వశాఖల్లో ఒకే పనికి ఒకే రకమైన వేతనం.. అది కూడా ఆన్‌లైన్ పద్థతిలో జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.