MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్ర ఆసక్తికరం.. రాజకీయాలు తక్కువైనా అదే ఉత్కంఠ

|

Mar 13, 2021 | 2:31 PM

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.

MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్ర ఆసక్తికరం.. రాజకీయాలు తక్కువైనా అదే ఉత్కంఠ
Follow us on

All arrangements over for AP MLC Elections: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు కావడంతో రాజకీయ ప్రమేయంతో కాస్త వాడీవేడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కొనసాగింది. దాంతో సహజంగానే మీడియా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎక్కువగా కవర్ చేసింది. కానీ అటు ఏపీలో రెండు ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం, ఇందులో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పోటీ చేస్తుండడంతో పెద్దగా ప్రచారార్భాటం కనిపించలేదు. కానీ ప్రచారం ముగిసే రోజున పలు చోట్ల ఓటర్లకు పంపిణీ చేసేందుకు తెచ్చిన కోట్లాది రూపాయలు దొరిపోవడంతో ఒక్కసారిగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పతాకశీర్షికలకు ఎక్కాయి.

ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఒకటి కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం కాగా.. రెండోది తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం. వీటికి 14వ తేదీన ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించి.. 17వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలో మొత్తం 13 వేల 505 ఓటర్లుండగా.. ఇందులో కృష్ణా జిల్లా పరిధిలో 6,424, గుంటూరు జిల్లా పరిధిలో 7,081 ఓటర్లున్నారు. వీరంతా ఓట్లు వేసేందుకు మొత్తం 111 పోలింగ్ స్టేసన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ల పరంగా చూస్తే.. కృష్ణా జిల్లాలో 51, గుంటూరు జిల్లాలో 60 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య 19. వీరిలో టీడీపీ, ఆక్టా మద్దతున్న సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రామకృష్ణ ఒకరు కాగా.. గతంలో ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన బొడ్డు నాగేశ్వరరావు ప్రొగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ తరపున, ఏపీటీఫ్‌ మద్దతుతో పి.పాండురంగ వరప్రసాదరావు, పీఆర్‌టీయూ కృష్ణయ్య మద్దతుతో టి. కల్పలత, సీపీఐ మద్దతుతో పీవీ మల్లికార్జునరావు, జనసేన మద్దతుతో గాదె వెంకటేశ్వరరావు, ఓ ఏపీ మంత్రి రిలేటివ్ చందు రామారావు పోటీ పడుతున్నారు.

ఇక తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 17 వేల 467. ఇందులో తూర్పు గోదావరిలో 9,702, పశ్చిమ గోదావరిలో 7,765 మంది ఓటర్లున్నారు. వీరి కోసం మొత్తం 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 67, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 49 పోలింగ్ స్టేషన్లున్నాయి. ప్రధానంగా పోటీలో 11 మంది అభ్యర్థులున్నారు. పీడీఎఫ్‌ మద్దతుతో యూటీఎఫ్‌ అధ్యక్షుడు షేక్‌ బాబ్జీ, ఎస్టీయూ, పీఆర్టీయూ మద్దతుతో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మామ గంధం నారాయణ రావు, టీడీపీ మద్దతుతో చెరుకూరి సుభాష్‌ చంద్రబోస్‌తో పాటు.. ఇళ్ల సత్యనారాయణ, గంటా నాగేశ్వరరావు, తిర్రే రవిదేవా, ఎంబీ నాగేశ్వరరావు, పలివెల వీర్రాజు, బడుగు సాయిబాబ, యడవల్లి రామకృష్ణప్రసాద్‌, పి. వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు.

2015 మార్చి 22వ తేదీన జరిగిన ఈ రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ఓసారి అవలోకనం చేసుకుంటే.. కృష్ణా-గుంటూరు జిల్లాల స్థానం నుంచి ఎఎస్‌ రామకృష్ణ విజయం సాధించారు. ఈయన టీడీపీ, కొన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా విజయం సాధించారు. సీపీఎం మద్దతుతో పోటీ చేసిన లక్ష్మణరావుపై రామకృష్ణ 1,763 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2015 ఎన్నికల్లో మొత్తం 18 వేల 931 ఓట్లు పోలవగా.. రామకృష్ణకు 7146 ఓట్లు వచ్చాయి. లక్ష్మణరావుకు 5,383 ఓట్లు వచ్చాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల స్థానం నుంచీ పీడీఎఫ్‌ తరపున రాము సూర్యారావు విజయం సాధించారు. ఆయన టీడీపీ మద్దతిచ్చిన చైతన్యరాజుపై 1,526 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2015 ఎన్నికల్లో 17 వేల 487 ఓట్లు పోలవగా.. సూర్యారావుకు 8,849 ఓట్లు, చైతన్యరాజుకు 7373 ఓట్లు పడ్డాయి. దాంతో 1526 ఓట్లతో సూర్యారావు విజయం సాధించినట్లు ప్రకటించారు. కాగా రామకృష్ణ, చైతన్యరాజుల పదవీ కాలం 2021 మార్చి 29వ తేదీతో ముగియనున్నది.

ALSO READ: ప్రతిష్టాత్మక పబ్లిక్ రంగ సంస్థలకు ఆలవాలం తెలంగాణ.. అదంతా గత చరిత్రేనా?