AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. వల వేసిన జాలరి పంట పండింది.. ఎంత రేటు పలికింది అంటే..?

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపల్లిపాలెం సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు భారీ పండుగప్ప చేప చిక్కింది. సుమారు 25 కిలోల బరువున్న ఈ చేపను కొనుగోలు చేసేందుకు వ్యాపారుల మధ్య పోటీ నెలకొంది. బహిరంగ వేలంలో స్థానిక వ్యాపారి రూ.28 వేలకు చేపను సొంతం చేసుకున్నారు.

ఆహా.. వల వేసిన జాలరి పంట పండింది.. ఎంత రేటు పలికింది అంటే..?
Pandugappa Fish
Ram Naramaneni
|

Updated on: Sep 05, 2026 | 11:52 AM

Share

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు అరుదైన భారీ పండుగప్ప చేప చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపల్లిపాలెం సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు 25 కిలోల బరువున్న పండుగప్ప దొరికింది. భారీ ఆకారంలో ఉన్న ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చిన వెంటనే స్థానికుల్లో ఆసక్తి మొదలైంది. చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు.

సాధారణంగా పండుగప్పకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటిది ఏకంగా 25 కిలోల బరువున్న భారీ చేప దొరకడంతో వ్యాపారులు దాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో స్థానికంగా బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో పలువురు వ్యాపారులు పోటీపడగా.. చివరకు ఓ స్థానిక వ్యాపారి రూ.28 వేలకు ఈ భారీ పండుగప్పను దక్కించుకున్నారు. ఒకే చేపకు ఇంతటి ధర పలకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

పండుగప్పకు అంత క్రేజ్ ఎందుకు?

చేపల ప్రియులకు పండుగప్ప పేరు కొత్తేమీ కాదు. ముఖ్యంగా కోనసీమ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో దీనికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పండుగప్పను సాధారణంగా సీబాస్‌/బర్రముండి పేర్లతో కూడా వ్యవహరిస్తారు. సముద్రపు ఉప్పునీటితో పాటు నదీ జలాల్లోనూ కనిపించడం ఈ చేప ప్రత్యేకతల్లో ఒకటిగా చెబుతారు.

ముఖ్యంగా దీని మాంసం మెత్తగా, రుచిగా ఉండటం, పెద్ద ముక్కలుగా రావడం వల్ల చేపల ప్రియులు ఇష్టపడతారు. వెన్నుపూస భాగంలో ప్రధాన ముళ్లు ఉండటం వల్ల ఇతర కొన్ని చేపలతో పోలిస్తే తినడానికి సులభంగా ఉంటుందని స్థానిక మత్స్యకారులు చెబుతుంటారు.

టేస్ట్ ఎలా ఉంటుందంటే..?

పండుగప్ప రుచే దీనికి అసలు బలం. పులుసులో వేస్తే మసాలాను బాగా పీల్చుకుని మెత్తగా ఉంటుంది. ఫ్రై చేస్తే బయట కాస్త క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే మాంసం ప్రత్యేకంగా అనిపిస్తుంది. కొందరు చేపల ప్రియులు దీని మాంసాన్ని చికెన్‌లా మెత్తగా ఉంటుందని కూడా చెబుతారు. పులుసు, ఫ్రైతో పాటు ఉప్పుచేపగా కూడా పండుగప్పను తింటారు.

అందుకే పులస సీజన్‌ ముగిసిన తర్వాత కూడా మంచి రుచిగల చేప కోసం చూసేవారిలో పండుగప్పకు డిమాండ్ ఉంటుందని స్థానిక మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద సైజులో దొరికే పండుగప్పకు మరింత డిమాండ్ రావడం సాధారణమే. గతంలో కూడా 20–25 కిలోల బరువున్న పండుగప్పలు వేలంలో వేల రూపాయల ధరలు పలికిన ఘటనలు నమోదయ్యాయి.

చేప దొరికితే మత్స్యకారులకు పండుగే!

అరుదుగా భారీ పండుగప్ప వలకు చిక్కడం మత్స్యకారులకు మంచి అదృష్టంగా భావిస్తారు. ఈసారి అంతర్వేదిపల్లిపాలెం సముద్ర తీరంలో దొరికిన 25 కిలోల భారీ పండుగప్ప కూడా అదే రీతిలో మత్స్యకారులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మార్కెట్‌లో వ్యాపారుల పోటీతో చివరకు రూ.28 వేల ధర పలకడంతో వారి సంతోషం రెట్టింపైంది. చేపల రారాజుగా పేరున్న పండుగప్ప.. ఈసారి 25 కిలోల బాహుబలి రూపంలో వలకు చిక్కి.. రూ.28 వేల ధరతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది.

Follow Us