తెళ్లారితే నిశ్చితార్థం. కోటి ఆశలతో కొత్త జీవితానికి నాంది పలుకుదాం అనుకుంది. తల్లి కోరిక మేరకు వివాహం చేసుకొని ఆమెను సంతోషపెట్టాలనుకుంది. కానీ అంతలోనే మృత్యువు ప్రమాదం రూపంలో దూసుకొచ్చింది. ముద్ద మందారంలా ఉన్న 24 ఏళ్ల యువతి అకాల మరణం వెంటాడింది. కుటుంబంలో తీవ్ర విషాధాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి మండంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్‌రెడ్డి, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు గీత, బిందు, ఒక కుమారుడు నారాయణరెడ్డిలు ఉన్నారు. ఎంతో కష్టపడి ముగ్గురిని బీటెక్ చదివించారు. అయితే లక్ష్మీదేవీ ఇటీవల తీవ్ర అనారోగ్యం బారినపడింది. దీంతో పెద్ద కూతురు వివాహం చేయాలని శ్రీరామ్ రెడ్డి నిశ్చయించుకున్నాడు.
లక్ష్మీదేవి కోరిక మేరకు పెళ్లి సంబంధాలను చూశారు. ఇంతలోనే ఓ సంబంధం కుదిరింది. ఆదివారం నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నిశ్చితార్థ వేడుకలో అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో గోరింటాకు పెట్టుకోవాలనుకుంది. ఇందులో భాగంగానే గోరింటాకు పెట్టించుకోవడం కోసం సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రికి వెళ్లారు.
అక్కడ గోరింటాకు పని పూర్తికాగానే తిరిగి ఇద్దరు గ్రామానికి బయలుదేరారు. గ్రామ శివారుల్లోకి రాగానే ఎదురుగా వచ్చిన ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో గీతా అక్కడిక్కడే మృతి చెందింది. సోదరుడు నారాయణ రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. నారాయణ రెడ్డిని తాడిపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఇంకెన్ని గంటలైతే నిశ్చితార్థం జరుగుతుందని అనుకుంటున్న సమయంలో ఇలా మరణం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి చేసుకుంటావని అనుకుంటే ఇలా జరిగిందా తల్లీ.. అంటూ తల్లిదండ్రుల రోదన అందరనీ కలిచి వేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..