US Interest Rate: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును 0.75 శాతం పెంచింది. అంతేకాదు, వచ్చే నెలలో మళ్లీ పెంచుతామని ప్రకటించింది. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫెడ్ నిర్ణయం తర్వాత వడ్డీ రేట్లు 1.75 శాతానికి పెరిగాయి. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదల కావడం గమనార్హం. దీంతో హౌసింగ్, వెహికిల్, ఇతర రుణాల విషయంలో అమెరికా ప్రజలపై భారం పడనుంది. వడ్డీ రేటును ఇంత ఎక్కువగా పెంచడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అమెరికా వృద్ధి రేటును మార్చిలో 2.8 శాతంగా అంచనా వేయగా దాన్ని 1.7 శాతానికి తగ్గించారు.
ఇక దీని ప్రభావంతో నిరుద్యోగిత కూడా పెరగనుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ సంవత్సరం నిరుద్యోగిత 4.1 శాతానికి చేరుకోవచ్చని, 2024 చివరి నాటికి 3.6 శాతానికి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ బ్లూప్రింట్‌ను చూస్తే వచ్చే ఏడాది మార్చిలో వడ్డీ రేటు దాని అంచనా కంటే చాలా ఎక్కువకు చేరుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వడ్డీ రేటు 1.9 శాతానికి చేరుకోవచ్చని, 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2.8 శాతానికి చేరుతుందని ఫెడ్ రిజర్వ్ మార్చిలో పేర్కొంది. తాజా అంచనాల ప్రకారం డిసెంబర్ నాటికి వడ్డీ రేటు 3.4 శాతానికి, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 3.8 శాతానికి చేరుతుందని అంచనా. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆహారం, ఇంధనం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ పరిస్థితి అమెరికా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. గ్యాసోలిన్ ధరలు పెరిగిపోతూ రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.