
ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే అంశం అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలకు కారణమవుతోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకున్న సమయంలో ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు ఇజ్రాయెల్‌కు చెందిన వైనెట్ న్యూస్ పేర్కొంది. అయితే, ఈ వాదనలను నెతన్యాహు కార్యాలయం ఖండించింది.
ఇరాన్‌పై దాడులు చేయాలని నెతన్యాహు ఒత్తిడి?
ఇరాన్‌పై సైనిక దాడులను తిరిగి ప్రారంభించాలని నెతన్యాహు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇరాన్ తన అణు సామర్థ్యాలను మళ్లీ అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయతొల్లాల పాలనను కూలదోయడమే ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును శాశ్వతంగా తొలగించే మార్గమని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రంప్ మాత్రం తక్షణ సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైన చర్చలు, ఆర్థిక ఆంక్షల ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
ఖండించిన నెతన్యాహు కార్యాలయం
ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న వార్తలను నెతన్యాహు కార్యాలయం తోసిపుచ్చింది. ఆ కథనాన్ని ‘నకిలీ వార్తలు, పూర్తిగా అసంబద్ధం’ అని పేర్కొంది. మరో సీనియర్ ఇజ్రాయెల్ అధికారి కూడా ఫోన్ సంభాషణ జరిగిన విషయాన్ని అంగీకరించినప్పటికీ, అది కఠినమైన చర్చ కాదని స్పష్టం చేశారు.
ట్రంప్‌పై రోజూ ఒత్తిడి తెస్తున్నారా?
ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్‌పై దాడులను పునఃప్రారంభించాలని నెతన్యాహు ట్రంప్ తో తరచూ ఫోన్ సంభాషణ చేస్తున్నట్లు సమాచారం. అయితే వైట్‌హౌస్‌లోని కొందరు అధికారులు యుద్ధాన్ని తిరిగి ప్రారంభించకుండా ప్రయత్నిస్తున్నట్లు ప్రముఖ మీడియా పేర్కొంది. ప్రాంతీయ దేశాల నాయకులు కూడా ఉద్రిక్తతలను పెంచకుండా చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్‌కు సూచిస్తున్నట్లు తెలిపింది.
యుద్ధం కంటే చర్చలకే ట్రంప్ ప్రాధాన్యం
ఇరాన్‌తో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడంపై ఆదివారం ’60 Minutes’ ఇంటర్వ్యూలో ట్రంప్ స్పందిస్తూ, ప్రస్తుతానికి అలాంటి చర్యకు కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ వైఖరుల మధ్య వ్యత్యాసం స్పష్టమవుతోంది. ఒకవైపు నెతన్యాహు సైనిక చర్యలు, పాలన మార్పు దిశగా ఒత్తిడి తెస్తున్నట్లు కథనాలు చెబుతుండగా, మరోవైపు ట్రంప్ దౌత్యం, ఆర్థిక ఒత్తిడికే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగిందన్న అంశంపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..