Srilanka: 50 రోజుల తర్వాత స్వదేశానికి చేరుకున్న గొటబాయ రాజపక్స.. నివాసం ఉండేది అక్కడే..

|

Sep 03, 2022 | 9:20 AM

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే థాయిలాండ్ నుండి స్వదేశానికి చేరుకున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ తిరుగుబాటు తరువాత దేశం విడిచి పారిపోయిన రెండు నెలల తర్వాత..

Srilanka: 50 రోజుల తర్వాత స్వదేశానికి చేరుకున్న గొటబాయ రాజపక్స.. నివాసం ఉండేది అక్కడే..
Gotabaya Rajapaksa
Follow us on

Srilanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే థాయిలాండ్ నుండి స్వదేశానికి చేరుకున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ తిరుగుబాటు తరువాత దేశం విడిచి పారిపోయిన రెండు నెలల తర్వాత మ‌ళ్లీ రాజపక్స శ్రీలంకకు చేరుకున్నారు. ఆయనకు అవసరమైన భద్రత కల్పించేందుకు శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. అధికారం నుంచి గొటబాయ రాజపక్స వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ ఈఏడాది జులైలో అధ్యక్ష భవనం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ప్రజలు ముట్టడించారు. దీంతో గతి లేని పరిస్థితుల్లో గొటబాయ రాజపక్స తొలుత మాల్దీవులకు పరారయ్యారు. అక్కడి నుంచి సింగపూర్‌, చివరిగా థాయ్‌లాండ్‌కు చేరుకున్నారు.

రాజపక్సకు థాయ్ లాండ్ ప్రభుత్వం 90 రోజులు ఉండేందుకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో స్వదేశానికి రావాలని రాజపక్స నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్2వ తేదీన థాయ్‌లాండ్‌ నుంచి సింగపూర్‌, అక్కడి నుంచి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో శ్రీలంకకు గొటబాయ రాజపక్స చేరుకున్నారు. భారీ భద్రతా మధ్య గొటబాయ రాజపక్స.. బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శ్రీలంక పొదుజన పెరమున పార్టీకి చెందిన పలువురు మంత్రులు, పార్లమెంటేరియన్లు విమానశ్రయంలో గొటబాయ రాజపక్సకు స్వాగతం పలికారు. రాజపక్సే కొలంబోలోని విజేరామా మావతకు సమీపంలోని ప్రభుత్వానికి చెందిన బంగ్లాలో నివసించనున్నారు. అక్కడ భారీగా ప్రభుత్వం భద్రతను కల్పించింది. మాజీ అధ్యక్షుడిగా రాజపక్సకు ప్రభుత్వం నివాసగృహం కేటాయించడంతో పాటు అవసరమైన భద్రతను కల్పిస్తోంది. గొటబాయ రాజపక్స తన పదవి నుంచి వైదొలగిన తర్వాత శ్రీలంక పార్లమెంటు అప్పటి తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాణిల్ విక్రమసింఘేను శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..