Video: ఈ 11 అంశాలే భారత్‌ కు ప్రత్యేకం ! ఫ్రెంచ్ ట్రైనర్ పోస్టు వైరల్!

భారత్‌లో ఉన్నప్పుడు ఆమెకు అవి పెద్దగా అనిపించలేదు. కానీ యూరప్‌కు తిరిగి వెళ్లిన తర్వాత.. ఆ విషయాలే ఆమెను వెంటాడాయి. ఫ్రాన్స్ కు చెందిన రోక్సేన్ యోగా సర్టిఫికేట్ కోర్సు చేయడానికి భారత్‌కు రాగా భారతీయుల రోజువారీ జీవనశైలిలోని ఎన్నో విషయాలు ఆమెను ఆకట్టుకున్నాయి. భారత్‌లో తను పరిశీలించిన, నేర్చుకున్న 11 విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఆసక్తిగా మారింది.

Video: ఈ 11 అంశాలే భారత్‌ కు ప్రత్యేకం ! ఫ్రెంచ్ ట్రైనర్ పోస్టు వైరల్!
Eleven Things Europeans Could Learn From Indians

Edited By:

Updated on: Oct 04, 2026 | 11:22 AM

అసలు విషయం ఆమె యూరప్‌కు తిరిగి వెళ్లిన తర్వాత తెలిసింది. అక్కడికి వెళ్లాక భారత్‌లో ఉన్నప్పుడు సాధారణంగా అనిపించిన విషయాలే తనకు మిస్ అవుతున్నాయని ఆమె గుర్తించింది. దీంతో ‘భారతీయుల నుంచి యూరోపియన్లు నేర్చుకోవాల్సిన 11 విషయాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.

చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండటం

యూరప్‌లో స్వతంత్రంగా జీవించడం ఎవరి మీదా ఆధారపడకపోవడం సాధారణం. కానీ భారత్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనీ, కుటుంబ సభ్యులు, పక్కింటివాళ్లు, స్నేహితులు.. చివరకు పెద్దగా పరిచయం లేని వాళ్లు కూడా తన చుట్టూ ఉండేవారనీ, మనుషుల మధ్య ఉండే ఈ అనుబంధం ఎంతో నచ్చిందనీ చెప్పింది. భారత్‌లో ఆధ్యాత్మికత ప్రత్యేకంగా ఏదో ఒక సందర్భానికి మాత్రం పరిమితం కాకుండా రోజువారీ జీవితంలోనే కనిపిస్తుందని రోక్సేన్ గుర్తించింది. భక్తి, పూజలు, ఆధ్యాత్మిక ఆలోచనలు సాధారణ జీవితం భాగంగా కావడం ఆకట్టుకుందని తెలిపింది.

ఏమీ చేయకుండా కూర్చోవడం కూడా ఓ కళే!

భారత్ లో ఎక్కువగా ఆకట్టుకున్న మరో విషయం ఏ పనీ చేయకుండా కూర్చోవడం. ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్న పెద్దలు.. చాయ్ తాగుతూ చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడటం నచ్చిందని చెప్పింది. పని పూర్తి చేయాలన్న తొందర లేదు.. ప్రత్యేకంగా ఓ ప్లాన్ అంటూ లేకపోయినా.. సమయం అట్టే గడిచిపోతుందనీ యూరప్‌లో మర్చిపోయిన ఈ చిన్న ఆనందాన్ని భారత్ ఆమెకు గుర్తు చేసిందనీ చెప్పుకొచ్చింది.

ఎదుటి వారిని పలకరించేటప్పుడు కేవలం ‘ఎలా ఉన్నావు?’ అనే కంటే.. ‘తిన్నావా?’ అని అడగడం భారతీయులలో సాధారణమనీ ఆ ప్రశ్నలోనే ఎదుటివారి పట్ల ఉన్న శ్రద్ధ కనిపిస్తుందని తెలిపింది. అన్నం, పప్పు, పెరుగు, పనీర్, దోశ, కూరగాయలు, కొబ్బరి.. ఇలా భారతీయ ఆహారంలోని ఎన్నో రుచులు ఆమెను ఆకట్టుకున్నాయి. విభిన్న రుచులు, ఎన్నో రకాల వంటకాలు తనకు కొత్త అనుభూతిని ఇచ్చాయని చెప్పింది.

ప్రతి నిమిషాన్నీ ఉత్పాదకంగా మార్చాల్సిన అవసరం లేదు

ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘ప్రొడక్టివిటీ’ చుట్టూ తిరుగుతోంది. ఖాళీగా కూర్చుంటే సమయం వృథా అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ భారత్‌లో మాత్రం కాసేపు కూర్చుని మాట్లాడటం, కలిసి సమయం గడపడం కూడా జీవితంలో భాగంగానే అనిపించిందని రోక్సేన్ చెబుతూ, ప్రతి క్షణాన్నీ ఏదో ఒక పని కోసం ఉపయోగించాల్సిన అవసరం లేదనీ అభిప్రాయపడింది.

రంగుల ప్రపంచం

యూరప్‌లో దుస్తులు, ఇళ్ల అలంకరణల్లో బీజ్‌ వంటి సాదాసీదా రంగులు ఎక్కువగా కనిపిస్తాయనీ  భారత్‌లో తనకు ఓ రంగుల ప్రపంచమే కనిపించిందట. చీరలు, గాజులు, పూలు, రంగురంగుల దుస్తులు, ఆభరణాలు.. ఇవన్నీ రోజువారీ జీవితానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి’ అని తెలిపింది. భారత్‌లో తనను ఆకట్టుకున్న మరో చిన్న విషయం.. అపరిచితులు కూడా అప్పుడప్పుడు ఎలాంటి కారణం లేకుండా చిరునవ్వు చిందించడం. ఆ చిరునవ్వులు తనకు ఎప్పుడూ కృత్రిమంగా అనిపించేవి కాదని, కొన్ని సెకన్ల చిన్న పరిచయం కూడా వాతావరణాన్ని మనకు మరింత సన్నిహితంగా మారుస్తుందని చెప్పింది.

ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే.. దాని చుట్టూ చాలా మాటలు చెప్పకుండా నేరుగా విషయానికి రావడం తనకు నచ్చిన మరో విషయమని రోక్సేన్ వీడియోలో తెలిపింది. యూరప్‌లో పది రకాల మర్యాదలు, చిన్నచిన్న మాటల తర్వాత అసలు విషయానికి వస్తారని.. భారత్‌లో మాత్రం మాట తీరు మరింత నేరుగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇక భారత్ గురించి మాట్లాడిన వారు చాయ్‌ను మర్చిపోగలరా? రోక్సేన్‌కు భారతీయ చాయ్ బాగా నచ్చేసింది. అయితే ఆమెను ఆకట్టుకున్నది చాయ్ రుచి మాత్రమే కాదు, చాయ్ పేరుతో కాసేపు ఆగి, పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడి.. కలిసి సమయం గడపడం ఆమెకు ప్రత్యేకంగా అనిపించిందట. చాయ్ తో పిచ్చాపాటి ఆమె 11 విషయాల జాబితాలో చోటు సంపాదించింది.

బాత్‌రూమ్‌లో నీటికి ప్రాధాన్యం

చివరగా రోక్సేన్ చెప్పిన విషయం సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది. భారత్‌లో బాత్‌రూమ్ అలవాట్లలో నీటికి ఇచ్చే ప్రాధాన్యాన్ని ఆమె ప్రస్తావించింది. టాయిలెట్ పేపర్‌ కాకుండా నీటిని కూడా ఉపయోగించే విధానం యూరప్‌లో విస్తృతం కావాలని ఆమె అభిప్రాయాన్ని వెల్లడించింది.  సరదాగా.. “నేను చెప్పాల్సింది చెప్పేశాను” అంటూ వ్యాఖ్యానించింది.

అయితే యూరప్ కంటే భారతీయ సంస్కృతి గొప్పదని చెప్పడం లేదనీ, తాను భారత్‌లో గడిపిన సమయంలో తన జీవితంలో భాగమైన చిన్న చిన్న విషయాలను మాత్రమే గుర్తుచేసుకున్నానని రోక్సేన్ స్పష్టం చేసింది. యోగా, కలరిపయట్టు వంటి భారతీయ సంప్రదాయాలతో పరిచయం పెంచుకున్న రోక్సేన్.. భారత్ నుంచి తిరిగి వెళ్లిన తర్వాత కూడా ఇక్కడి జీవనశైలిలోని కొన్ని అంశాలను తనతో పాటు తీసుకెళ్లింది. ఒక కప్పు చాయ్.. ‘తిన్నావా?’ అనే ఆప్యాయమైన ప్రశ్న.. పక్కింటి వ్యక్తితో కాసేపు మాట కలపడం.. కారణం లేకుండా వచ్చే చిరునవ్వు.. ఏమీ చేయకుండా కలిసి కూర్చుని మాట్లాడుకోవడం.. ఇవన్నీ చిన్న విషయాలే కావచ్చు. కానీ కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులు తీసుకొచ్చేది ఇలాంటి చిన్న విషయాలే అని రోక్సేన్ అభిప్రాయం వెలిబుచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us