తీవ్ర సంక్షోభంలో కూరికుపోయి ప్రజల తిరుగుబాటుకు గురైన శ్రీలంక మెల్లమెల్లగా దారిలో పడుతోంది. గొటబాయ రాజపక్సే ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలను ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. రాజపక్సే హయాంలో పూర్తిగా చైనా చెప్పు చేతల్లోకి వెళ్లిపోయిన దౌత్య, విదేశాంగ విధానాన్ని మార్చి, శ్రీలంక అభివృద్ధి పయనంలో భారత్, అమెరికా దేశాలను భాగస్వాములను చేశారు. అలాగని చైనాను పూర్తిగా వదిలించుకోలేకపోయారు. వదిలించుకోలేనంత రుణభారం ఓ కారణమైతే, చైనాను పూర్తిగా దూరం పెడితే భారత్, అమెరికా దేశాలు శ్రీలంకపై ఇంత ఆసక్తి చూపే అవకాశాలు కూడా ఉండవన్నది మరో కారణం.
చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే క్రమంలో శ్రీలంకలో అమెరికా భారీ పెట్టుబడులతో ముందుకొస్తే, పొరుగు రాజ్యం చైనాకు బలైతే అది భారత్ భద్రతకే పెను ముప్పు. అందుకే మన దేశం ఆ శ్రీలంకకు ఇతోధికంగా సాయపడుతోంది. మొత్తంగా చైనాను బూచిగా చూపుతూ భారత్, అమెరికా సాయం పొందడం ద్వారా రణిల్ విక్రమసింఘే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న దేశాన్ని బయటపడేసేందుకు శతవిధాలుగా శ్రమిస్తున్నారు.
చైనాతో మితిమీరిన స్నేహం.. చారిత్రక తప్పిదం
ఏ దేశమైనా అభివృద్ధి కోసం అప్పటికే అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవడం కొత్తేమీ కాదు. దాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ ఆర్థిక సహాయం మాటున దురుద్దేశాలు కలిగి ఉంటే అప్పు తీసుకునే దేశం జాగ్రత్తపడక తప్పదు. ప్రపంచంలో అనేక దేశాలకు లెక్కకు మించి రుణాలిచ్చి, వాటిని తిరిగి చెల్లించలేని స్థితికి తీసుకొచ్చి, మెల్లగా ఆ దేశంపై పెత్తనం చేసే దుష్ట పన్నాగం చైనా చేస్తోంది. భారత్‌తో పురాణేతిహాసాల నుంచి నేటి వరకు సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాల్లో అనుబంధం కలిగిన శ్రీలంకలో పాగా వేస్తే భారత్‌పై సముద్ర మార్గం ద్వారా నిఘా పెట్టొచ్చు అని చైనా భావించింది. దీన్ని అడ్డుకోవాలని భారత్‌తో పాటు అమెరికా సైతం ప్రయత్నించినా, నాటి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పూర్తిగా చైనా అనుకూల వైఖరి అవలంబించడంతో అది సాధ్యపడలేదు.
ప్రపంచవ్యాప్తంగా చైనా వివిధ దేశాలకు రుణాలు, గ్రాంట్ల రూపంలో 1 ట్రిలియన్ డాలర్ల మేర అందజేస్తే, అందులో 12 బిలియన్ డాలర్ల మేర శ్రీలంకకే అందించింది. వాటిలో శ్రీలంక తిరిగి చెల్లించిన మొత్తం పోగా, ఇంకా ఇప్పటికీ 7.1 బిలియన్ డాలర్ల మేర రుణపడి ఉంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక రుణాలు, సార్వభౌమాధికార హామీల క్రింద ప్రభుత్వ సంస్థలు పొందగా, మిగతా 3 బిలియన్ డాలర్లు వాణిజ్యపరమైన రుణాల రూపంలో ఉన్నాయి. శ్రీలంక ద్వైపాక్షిక రుణాలపై రుణ-ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాణిజ్య రుణాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదు.
కొత్తగా హంబన్‌తోట పోర్ట్‌లో 1.6 బిలియన్ డాలర్ల విలువైన చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించి, నిర్వహించే కాంట్రాక్టును చైనా దేశ చమురు సంస్థ సినోపెక్ పొందింది. ఇందులో 85% వాటా చైనా మర్చంట్స్ పోర్ట్ హోల్డింగ్స్‌కు ఉండగా, మొత్తం 99 ఏళ్ల లీజుపై ప్రాజెక్టు చేపట్టింది. పోర్ట్‌తో పాటు సమాంతరంగా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తోంది. మరో చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ కొలంబో సముద్ర తీరంలో దుబాయ్‌కి పోటీగా ఓడ రేవు నగరాన్ని నిర్మిస్తోంది. చాలా మంది నిపుణులు ఈ ద్వీపంపై పెరుగుతున్న చైనా ఆర్థిక ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో చైనా నుంచి తీసుకున్న అప్పుల కారణంగా శ్రీలంక నిండా మునిగిపోతుందని భయపడుతున్నారు. మరికొందరు చైనా ప్రాజెక్టులు శ్రీలంకను భౌగోళిక వ్యూహాత్మక ప్రత్యర్థిగా మార్చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశావాదులు మాత్రం అటు చైనా నుంచి ఇటు అమెరికా, భారత్ వంటి దేశాల నుంచి సహాయం పొంది దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్పేమీ కాదని సూత్రీకరిస్తున్నారు. చైనా బూచి లేకపోతే అమెరికా, భారత్ వంటి దేశాలు శ్రీలంకపై ఇంత ఆసక్తి చూపవని కూడా చెబుతున్నారు. కానీ చైనాతో మితిమీరిన స్నేహం చారిత్రక తప్పిదం అన్నది ప్రస్తుత పాలకులకు ఇప్పటికే అర్థమైంది.
విక్రమసింఘే వ్యూహాత్మక విధానం
కొలంబో పోర్ట్‌లో 533 మిలియన్ డాలర్ల విలువైన డీప్‌వాటర్ టెర్మినల్‌ను నిర్మించాలని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) ఈ వారం తన ప్రణాళికలను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ శ్రీలంకలో అతిపెద్ద అమెరికా మౌలిక సదుపాయాల ఒప్పందం. ఆసియా-పసిఫిక్‌లో అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీలలో ఒకటి. US ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (DFC) రుణాన్ని అదానీ గ్రూప్‌కి లింక్ చేసింది. ముంబై స్టాక్ మార్కెట్-లిస్టెడ్ కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కొలంబో వెస్ట్రన్ కంటైనర్ టెర్మినల్‌లో 51% వాటా కలిగి ఉండగా.. 35% శ్రీలంక గ్రూప్ జాన్ కీల్స్ కలిగి ఉంది. మిగతా వాటా ప్రభుత్వ పోర్ట్ అథారిటీది. ఈ ప్రాజెక్ట్ భారత్ తర్వాత ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో USIDFC రెండవ అతిపెద్ద ప్రాజెక్ట్. శ్రీలంకలో ఈ సంస్థ పెట్టుబడులు నాలుగు సంవత్సరాల క్రితం కేవలం 20 మిలియన్ డాలర్లు ఉండగా.. ఇప్పుడవి 1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దేశంలో అమెరికా ఆర్థిక ప్రమేయంపరంగా కూడా ఇది గణనీయమైన మార్పును సూచిస్తుంది. గోటబయ రాజపక్సే ప్రభుత్వం ఉదాసీనత కారణంగా అనేక ప్రయత్నాలు విఫలమవగా.. వాషింగ్టన్-ఆధారిత మిలీనియం ఛాలెంజ్ కార్పొరేషన్ నుంచి 480 మిలియన్ డాలర్ల గ్రాంట్ కోసం శ్రీలంక ఆసక్తి చూపలేదు. ఇది మాత్రమే కాదు, కొలంబో తూర్పు టెర్మినల్‌ను నిర్మించడానికి భారత్-జపాన్‌తో ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. అయితే కొలంబో వెస్ట్రన్ కంటైనర్ టెర్మినల్‌ను మాత్రం అదానీ గ్రూప్‌కు ఇచ్చింది.
శ్రీలంక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే పశ్చిమ దేశాలకు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. గోటబయ రాజపక్సే విదేశాంగ విధానం వల్ల ఏర్పడిన నష్టాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో శ్రీలంక అభివృద్ధి కథలో చైనాతో పాటు ఇతర దేశాలను కూడా చేర్చారు. శ్రీలంక ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అమెరికా, భారత్‌తో పాటు యురోపియన్ యూనియన్ (EU) దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.
➤ ట్రింకోమలీ ఓడరేవు సమగ్ర అభివృద్ధి ప్రపంచంలోనే అతిపెద్ద సహజ నౌకాశ్రయంగా ఉన్న ప్రధాన భౌగోళిక-వ్యూహాత్మక ప్రాజెక్టులలో ఒకటి. ఇది భారత్ – జపాన్ జాయింట్ వెంచర్‌తో కీలక ఆర్థిక కేంద్రంగా ఉద్భవించింది.
➤ అదానీ గ్రూప్ కూడా శ్రీలంకలో పునరుత్పాదక శక్తిలో 750 మిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు సిద్ధపడింది. ద్వీపం ఉత్తరాన 500 MW పవన విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది.
➤ MCC గ్రాంట్ – జపాన్ నిధులతో కొలంబో మెట్రో రైల్వేతో సహా గత ప్రభుత్వం సస్పెండ్ చేసిన ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి కూడా విక్రమసింఘే లాబీయింగ్ చేస్తున్నారు.
కొలంబో పోర్ట్ టెర్మినల్ కోసం DFC నుంచి నిధులు కేటాయించడం US ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగం. అలాగే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)కి ప్రత్యామ్నాయమైన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)తో దీన్ని అనుసంధానం చేయవచ్చు. తద్వారా అమెరికా మిత్రదేశాలతో వనరులను సమీకరించడంతో పాటు దిగ్గజ దేశం చైనాను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. మొత్తంగా భారత్, అమెరికాలతో పాటు యురోపియన్ యూనియన్ పెట్టుబడులతో శ్రీలంకను సంక్షోభం నుంచి బయటపడేయడంతో పాటు ద్వీపదేశాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడమే కాదు.. చైనా కోరల్లో చిక్కుకున్న దేశాన్ని బయటపడేయవచ్చు. అదే సమయంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయవచ్చు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి…