Alien Attack: ఆ దేశపు సైనికులపై ఏలియన్స్‌ దాడి..? అమెరికా నిఘా సంస్థ రిపోర్ట్‌ ఏం చెబుతోంది..?

1989-90లో ఉక్రెయిన్‌లో సోవియట్ సైనికులపై UFO దాడి జరిగినట్లు CIA రహస్య ఫైల్స్‌లో ఒక రిపోర్టు బయటపడింది. సోవియట్ సైనికులు UFOపై కాల్పులు జరపడంతో, 23 మంది సైనికులు రాయిలా మారిపోయారు. ఈ సంఘటనపై 'ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్' పాడ్‌కాస్ట్‌లో కూడా చర్చ జరిగింది.

Alien Attack: ఆ దేశపు సైనికులపై ఏలియన్స్‌ దాడి..? అమెరికా నిఘా సంస్థ రిపోర్ట్‌ ఏం చెబుతోంది..?
Alien Attack

Updated on: Apr 16, 2025 | 1:24 PM

ఏలియన్స్‌ (గ్రహాంతరవాసులు) ఉన్నారా? లేదా? అనే చర్చ ఇప్పటి కాదు. కానీ, అమెరికా నిఘా సంస్థ CIA కు చెందిన ఫైల్స్‌లో మాత్రం ఏలియన్స్‌ సంబంధించి ఒక కీలక రిపోర్ట్‌ ఉంది. ఆ రిపోర్ట్‌లో సోవియన్‌ యూనియన్‌ సైనికులపై ఏలియన్స్‌ దాడి చేశారనే సంచలన విషయం ఉంది. సోవియట్ యూనియన్ సైనికులు ఓ UFO(గాల్లో ఎగిరే ఓ గుర్తు తెలియని వాహనం)పై కాల్పులు జరపడంతో అందులో ఉన్న ఏలియన్స్ తీవ్రంగా స్పందించి 23 మంది సైనికులను రాయిలా మార్చేసినట్లు ఆ నివేదికలో ఉంది. ఈ ఘటన 1989 – 1990 మధ్య ఉక్రెయిన్‌లో జరిగిందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన వీక్లీ వరల్డ్ న్యూస్, ఉక్రెయిన్ పత్రిక హోలాస్ ఉక్రెయినీ తొలుత ఈ కథనాన్ని ప్రచురించగా.. తర్వాత CIA నుంచి 250 పేజీల నివేదికను కేజీబీ సేకరించింది. ఈ అంశంపై ‘ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్’ పాడ్‌కాస్ట్‌లో కూడా ప్రస్తావించడంతో మరోసారి గ్రహాంతర వాసులు అంశం చర్చనీయాంశంగా మారింది.

అసలు అక్కడ ఏం జరిగిందంటే..?

ఉక్రెయిన్‌లో సాధారణ శిక్షణా విన్యాసాలు నిర్వహిస్తున్న సోవియట్‌ సేనికులకు ఆకాశంలో చాలా తక్కువ ఎత్తులో ఓ సాసర్ ఆకారంలో ఎగురుతున్న విచిత్రమైన వాహనం కనిపించింది. దీంతో సోవియన్‌ సైనికులు దానిపైకి క్షిపణిని ప్రయోగించారు. ఆ సాసర్‌ ఆకారం గల వాహనం చాలా దూరంలో భూమిపై పడింది. దాని నుంచి పెద్ద తలలు, పెద్ద నల్లటి కళ్ళు కలిగిన ఐదు చిన్న ఆకారాలు బయటికి వచ్చాయి. తమపై దాడి చేసిన సోవియట్‌ సైనికులపై కాంతి లాంటి వస్తువులతో అవి ఎదురుదాడి చేశాయి. వాటి దాడితో 23 మంది సైనికులు ఉన్నచోటనే రాయిలా మారిపోయారు. ఓ ఇద్దరు సైనికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇదంతా.. ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలా అనిపిస్తున్నప్పటికీ.. అమెరికా నిఘా సంస్థ ఫైల్స్‌లో ఈ రిపోర్ట్‌ ఉండటంతో ఎవరూ కూడా దీన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయడం లేదు. అయితే.. ఆ దాడి తర్వాత ఏలియన్స్‌ వారి వాహనాన్ని బాగుచేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ దొరికిన శకలాలను కేజీబీ ఏజెంట్లు ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. గ్రహాంతర వాసుల వద్ద మనం ఊహించిన దానికన్నా అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్లు సీఐఏ తేల్చినట్లు ఆ పత్రాల్లో ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.