China Tibetans Recruits: తూర్పు లడఖ్ సమీపంలో, ఇటీవలి సరిహద్దు ఉద్రిక్తతల ప్రదేశమైన, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) ప్రాంతాల్లో స్థానిక టిబెటన్ యువకులను నియమించుకుంటూ కొత్త మిలీషియా యూనిట్లను చైనా పెంచుతోంది. యువ టిబెటన్లను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్థానిక మిలీషియోల్లో చేర్చే ప్రయత్నాలను చైనా ముమ్మరం చేసింది. పిఎల్‌ఏలో చేరడానికి చైనా యువ టిబెటన్లకు రకరకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది చైనా. దీనితో పాటు సరిహద్దు ప్రాంతంలో వారిని మార్గదర్శకులుగా పని చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చైనా తన సైనిక బలాన్ని బలోపేతం చేస్తూ భారతదేశం సరిహద్దులో తన వైమానిక స్థావరాలను అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంది. 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంట లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న అన్ని ప్రాంతాల్లో పీఎల్‌ఏ కార్యకలాపాలను పెంచింది.
అలాగే జిత్తులమారి డ్రాగన్ సైన్యం ఉత్తరాఖండ్ లోని బారాహోటి ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తన సైనిక కార్యకలాపాలను పెంచేసింది. ఈ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల విరామం తర్వాత చైనా సైన్యం కదలికలు మళ్లీ కనిపించాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)కి చెందిన సుమారు 40 దళాలు ఇటీవల బారాహోటి ప్రాంతంలో ఎల్‌ఏసీకి అవతలి వైపు గస్తీ నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, ఇటీవలి కాలంలో ఎల్‌ఏసీ వెంబడి వెలుగుచూసిన పరిణామాల నేపథ్యంలో.. సమీప భవిష్యత్తులో అక్కడి సెంట్రల్ సెక్టార్‌లో చైనా తన సైనిక కార్యకలాపాలను మరింత పెంచవచ్చని అనుమానిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాయి. బారాహోటి సమీపంలోని తమ వైమానిక స్థావరం వద్ద కూడా సైనిక కార్యకలాపాలను చైనా పెంచినట్లు వెల్లడించాయి. అక్కడి నుంచే డ్రోన్లు, హెలికాప్టర్లను డ్రాగన్ సైన్యం ప్రయోగిస్తున్నట్లు వివరించాయి. బారాహోటిని తమ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొంటూ చైనా పలుమార్లు అక్కడ అతిక్రమణలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో లడఖ్ మాదిరి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు గత సంవత్సరం ఇదే సెక్టార్‌లో భారత సైన్యం తమ దళాలను మోహరించింది. సెంట్రల్ సెక్టార్‌లోనూ అదనపు బలగాలను మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, సెంట్రల్ సెక్టార్ వద్ద భద్రతా ఏర్పాట్లను భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, సెంట్రల్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వై దిమ్రి ఇటీవల సమీక్షించారు. తూర్పు లద్దాఖ్‌లోని పలు వివాదాస్పద ప్రాంతాల వద్ద గత సంవత్సరం మే నెల నుంచి భారత్, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన నెలకొంది. దశలవారీగా నిర్వహించిన సైనిక చర్చ అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల వెంబడి ఇరు పక్షాలు తమ సైన్యాన్ని వెనక్కు రప్పించాయి. మరికొన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంలో భాగంగా ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి.