ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు అమెరికా సిద్ధమవుతుంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ పంపిణీకి రెఢీ అవుతోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాను ముందస్తుగా ఆ దేశ వాలంటీర్లకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు.
ముఖ్యంగా ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి లభించిన తర్వాత 24 గంటల్లోపు దేశవ్యాప్తంగా 6.4 మిలియన్ల డోసులు పంపిణీ చేసేందుకు అమెరికా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత మహమ్మారిపై పోరులో ముందు వరుసలో ఉన్న సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామని ‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్’ ప్రాజెక్టులో పంపిణీ విభాగానికి బాధ్యత వహిస్తున్న జనరల్ గుస్తావ్ పెర్నా తెలిపారు. రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన డోసుల్ని కేటాయించామని.. ఆ వివరాలను ఆయా ప్రభుత్వాలకు శుక్రవారం రాత్రే తెలియజేశామన్నారు.
ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా 20 మిలియన్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే, 6.4 మిలియన్ల డోసుల్లో కొన్నింటిని.. కొవిడ్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న ‘బ్యూరో ఆఫ్ ప్రిజన్స్’, ‘నేషనల్ హెల్త్ సర్వీస్’, వెటరన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఫెడరల్ విభాగాలకూ అందజేస్తామన్నారు జనరల్ గుస్తావ్ పెర్నా. వ్యాక్సిన్ ఉత్పత్తిని బట్టి ప్రతివారం మిలియన్ల కొద్దీ డోసుల్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తామన్నారు.
ఇదిలావుంటే, డిసెంబరు రెండోవారంలో ఫైజర్ టీకాకు అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ఓ ఛాలెంజ్‌గా స్వీకరించిన ఫెడరల్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఫైజర్ నుంచి 40 మిలియన్ల డోసులు, మోడెర్నా నుంచి 20 మిలియన్ల డోసుల కోసం ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. ఏప్రిల్ నాటికి అమెరికాలో ప్రతి సాధారణ పౌరుడికి కరోనా టీకాను అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. ఇక, అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ నిల్వ చేయాల్సిన ఆస్పత్రుల్ని ఇప్పటికే ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. ఫైజర్ టీకా అతిశీతల వాతావరణంలో నిల్వ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆ వసతులు ఉన్న ఆస్పత్రులనే పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఒక్కో రాష్ట్రంలో 3-5 కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
మరోవైపు ఆరోగ్య సిబ్బంది తర్వాత సుదీర్ఘ కాలంగా ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్న మూడు మిలియన్ల మందికి ప్రాధాన్యత టీకా అందించడం జరుగుతుంది అధికారులు చెబుతున్నారు. అనంతరం బోధన, నిత్యావసర సరకులు అందించడం వంటి ఇతర అత్యవసర సేవల్లో ఉన్న 87 మిలియన్ల మందిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఆ తర్వాత 65 ఏళ్ల పైబడి.. కొవిడ్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వారికి వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. పంపిణీ ప్రక్రియను ఇప్పటికే పలుసార్లు ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు తెలిపారు. ఇక అమెరికన్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ట్రంప్ సర్కార్ ఇదివరకే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.