రూట్ మార్చిన జహీరాబాద్ రైతులు.. ఆలు సాగుకు గుడ్‌బై!

Updated on: Oct 25, 2026 | 4:53 PM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలో ఆలుగడ్డ సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గతేడాది భారీ నష్టాలు రావడంతో ఈసారి రైతులు పంట వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. గతంలో 3,000 ఎకరాల్లో సాగైన ఆలుగడ్డ విస్తీర్ణం ఈసారి 1,000 ఎకరాల లోపే ఉండొచ్చని అంచనా. విత్తన ధరలు తగ్గినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడం, పెట్టుబడి ఖర్చులు పెరగడం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తున్నాయి.

సాంప్రదాయ పంటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డ సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకప్పుడు స్వల్పకాలిక పంటగా రైతులకు కాసుల వర్షం కురిపించిన బంగాళాదుంప.. నేడు వారి కళ్లలో కన్నీళ్లు మిగులుస్తోంది. వాతావరణం సహకరించకపోవడం, గతేడాది భారీ నష్టాలు చవిచూడటంతో ఈసారి రైతాంగం ఆలు సాగుకు పూర్తిగా విముఖత చూపుతోంది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, కోహిర్, ఝరాసంఘం మండలాల్లో ప్రతి ఏటా రైతులు విస్తారంగా ఆలు సాగు చేస్తారు. జిల్లా మొత్తం సాగయ్యే ఆలుగడ్డలో 90 శాతం వాటా జహీరాబాద్ ప్రాంతానిదే. తక్కువ రోజుల్లో చేతికి వచ్చే పంట కావడంతో రైతులు ఎంతో మొగ్గు చూపేవారు. కానీ ఈ ఏడాది సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గతేడాది జిల్లాలో సుమారు 3,000 ఎకరాల్లో ఆలు సాగు కాగా.. ఈసారి కనీసం 1,000 ఎకరాలు కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు ఈ పంట వేయడానికే భయపడుతున్నారు. మరోవైపు గతేడాదితో పోలిస్తే ఆలుగడ్డ విత్తన ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాది క్వింటాల్ విత్తనం ధర రూ.3,800 నుంచి రూ.4,000 వరకు ఉండగా.. ఈ ఏడాది అది రూ.1,800 లకే లభిస్తోంది. విత్తనం ధర సగానికి తగ్గినప్పటికీ రైతులు ఆసక్తి చూపడం లేదు. ఆలు సాగులో కేవలం విత్తనమే కాకుండా రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, రవాణా ఛార్జీల రూపంలో 90 శాతం వరకు పెట్టుబడి అవుతోంది. గత ఏడాది ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోయామని, మార్కెట్లో క్వింటాకు కేవలం రూ.600 మాత్రమే ఇచ్చి, అందులో రూ.200 రవాణాకే పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఈసారి రిస్క్ ఎందుకని వెనకడుగు వేస్తున్నారు. దీంతో జహీరాబాద్ ప్రాంత రైతాంగం ఈసారి రూట్ మార్చింది. సాధారణంగా సోయాబీన్ తర్వాత అదే పొలంలో ఆలుగడ్డ వేసేవారు. కానీ పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడానికి సోయాబీన్‌లో కంది పంటను అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఆలుగడ్డకు ప్రత్యామ్నాయంగా చెరకు, కంది పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి, ఆలుగడ్డ రైతులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు పెంచితేనే ఈ సాంప్రదాయ పంట బతికే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర, రవాణా సబ్సిడీలు ఉంటే తప్ప ఆలు రైతు కోలుకునేలా లేడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో మొదలైన రైతుల కష్టాలు

చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ముప్పు! సముద్రాల్లో రికార్డు స్థాయి వేడి.. తీవ్ర కరవు, వరదల ప్రమాదం!

Loading...
Unable to load recommendations.
Follow Us