ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులపై ‘డబుల్’ షాక్.. భారతీయులపై ఎఫెక్ట్
అమెరికాలో పెట్టుబడి ద్వారా గ్రీన్‌కార్డ్ పొందాలని చూస్తున్న విదేశీ ఇన్వెస్టర్లకు కొత్త ఫీజుల భారం పెరగనుంది. EB-5 ప్రోగ్రామ్‌లోని పలు దరఖాస్తుల రుసుములను USCIS భారీగా పెంచింది. I-526, I-526E, I-829, I-956F వంటి ఫారమ్‌లకు కొత్త ఫీజులు నవంబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా I-956F ఫీజు భారీగా పెరగడం గమనార్హం. అమెరికాలో పెట్టుబడి పెట్టాలనుకునే భారతీయ ఇన్వెస్టర్లపై కూడా ఈ మార్పు ప్రభావం చూపే అవకాశం ఉంది.
అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే విదేశీ ఇన్వెస్టర్లకు అమెరికా ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెట్టుబడి ఆధారిత ఈబీ-5 గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచుతూ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల దరఖాస్తు రుసుములు ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ కొత్త ఫీజుల నిబంధనలు నవంబరు 30 నుంచి అమల్లోకి రానున్నాయి. దరఖాస్తుల సమీక్ష, బ్యాక్‌గ్రౌండ్ తనిఖీలు, అర్హత ధ్రువీకరణ, మోసాలను అరికట్టేందుకు అయ్యే ఖర్చులను భరించేందుకే ఈ ఫీజులు పెంచినట్లు USCIS తెలిపింది. స్టాండ్‌ఎలోన్ ఇన్వెస్టర్లు ధరఖాస్తు చేసుకునే I-526 ఫామ్ ఫీజును 3,675 డాలర్ల నుంచి 7,615 డాలర్లకు పెంచనున్నారు. గుర్తింపు పొందిన రీజినల్ సెంటర్ ద్వారా పెట్టుబడులు పెట్టే విదేశీయులు ఉపయోగించుకునే I-526E దరఖాస్తు రుసుము 3,675 డాలర్ల నుంచి 7,850 డాలర్లకు పెరగనుంది. దీనికి 75 డాలర్ల టెక్నాలజీ ఫీజు అదనం. తమ శాశ్వత నివాస హోదాపై ఉన్న షరతులను తొలగించాలని కోరుతూ పెట్టుబడిదారులు దాఖలు చేసే I-829 దరఖాస్తు ఫీజును 3,750 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెంచనున్నారు. అమెరికా వాణిజ్య సంస్థల్లో పెట్టుబడికి ఆమోదం కోరుతూ దరఖాస్తు చేసే I-956F ఫామ్ ఫీజు ధర 17,795 డాలర్ల నుంచి 42,675 డాలర్లకు పెరగనుంది. 1990లో ప్రారంభమైన ఈ ఈబీ-5 ప్రోగ్రామ్ కింద విదేశీ ఇన్వెస్టర్లు అమెరికా వ్యాపారాల్లో 1.05 మిలియన్ డాలర్లు లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 8 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి, కనీసం 10 మందికి ఉపాధి కల్పించాలి. దీనిద్వారా ఇన్వెస్టర్‌తో పాటు కుటుంబ సభ్యులకు గ్రీన్‌కార్డ్ లభిస్తుంది. గత దశాబ్దకాలంగా అమెరికా గ్రీన్‌కార్డ్ కోసం భారతీయుల నుంచి ఈ కేటగిరీలో డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటికే కంట్రీ కోటా వల్ల సుదీర్ఘకాలం వేచి చూస్తున్న భారతీయ ఇన్వెస్టర్లకు, ఈ అదనపు ఫీజుల భారం గట్టి దెబ్బ కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ దగ్గరవుతోన్న భారత్-చైనా
ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె గుభేల్
ఇక రైల్వే స్టేషనే పోలీస్ స్టేషన్.. ఏపీలో కొత్త సేవలు!
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..? థియేటర్‌కు దిమ్మతిరిగే షాక్..
