ర్యాట్‌ స్నాకింగ్‌… ఇదో వింత అలవాటు..! కానీ చాలా డేంజర్!

Updated on: May 25, 2026 | 4:37 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ర్యాట్ స్నాకింగ్’ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకలి లేకపోయినా రోజంతా జంక్ ఫుడ్ నములుతూ ఉండే ఈ అలవాటు అధిక బరువు, జీర్ణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, డయాబెటిస్‌కు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి నిద్ర ద్వారా దీనిని నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటర్నెట్ యుగంలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. ఈ మధ్యకాలంలో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో “ర్యాట్ స్నాకింగ్” అనే పదం బాగా వైరల్ అవుతోంది. వినడానికి ఇదేదో వింతగా ఉన్నప్పటికీ, నేటితరం యువతలో ఇది ఒక ప్రధానమైన ఈటింగ్ హాబిట్‌గా మారిపోయింది. అసలు ఈ ‘ర్యాట్ స్నాకింగ్’ అంటే ఏమిటి? ఈ అలవాటు ప్రమాదకరమా? ర్యాటి స్నాకింగ్‌ వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుంది.. ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఎలుకలు ఏం చేస్తాయి? వీలు దొరికినప్పుడల్లా, ముఖ్యంగా రాత్రి పూట కిచెన్‌లోకి దూరి చేతికి దొరికిన చిన్న చిన్న పదార్థాలను కొరుక్కు తింటూ ఉంటాయి. సరిగ్గా అలాగే మనుషులు కూడా ఒక నిర్ణీత సమయం అంటూ లేకుండా, రోజంతా చేతికి ఏది దొరికితే అది తింటూనే ఉంటారు. ముఖ్యంగా చిప్స్, బిస్కెట్లు, చీజ్ ముక్కలు, మిక్స్చర్ లాంటి జంక్ ఫుడ్‌ను నిరంతరం ఇలా ఏదొకటి నములుతూ ఉండటాన్నే హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ‘ర్యాట్ స్నాకింగ్’ అని పిలుస్తున్నారు. ఇక్కడ టైం టు టైం తినాలనే నియమం ఉండదు, అలాగే ఆకలి వేసే వరకు ఆగాలనే ఓపికా ఉండదు. పగలు, రాత్రి అనే తేడా అసలే ఉండదు.. కంటికి కనిపించిన ప్రతీదాన్నీ నోట్లో వేసుకోవడమే ఈ అలవాటుకున్న ముఖ్య లక్షణం. కొంతమంది ఆకలివేస్తేనే తింటారు. మరికొందరు ఆకలి లేకపోయినా టైముకి తినాలనే ఓ ఆలోచనతో తింటూ ఉంటారు. కానీ ఈ ‘ర్యాట్ స్నాకింగ్’ బాధితులు మాత్రం టీవీ చూస్తూనో, ఫోన్ వాడుతూనో లేదంటే ల్యాప్ టాప్ ముందు ఆఫీస్ పని చేసుకుంటూనో పక్కన చిరుతిళ్లు పెట్టుకుని తింటూ ఉంటారు. దీనివల్ల మనం ‘ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం’ అనే కనీస స్పృహ ఉండదు. ఫలితంగా అవసరానికి మించి అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుతున్నాయి. ఇలా మనసు అదుపులో లేకుండా తినే ఆహారమంతా శరీరంలో కొవ్వుగా మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ‘ర్యాట్ స్నాకింగ్’ అలవాటు మొదట సరదాగా, టైంపాస్‌గా అనిపించినప్పటికీ, లాంగ్ రన్‌లో ఇది మీ జీర్ణవ్యవస్థను, హార్మోన్ల సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. ఈ ర్యాట్‌ స్నాకింగ్‌లో ప్రజలు ఎక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‌నే ఎంచుకుంటారు. దీనివల్ల శరీరానికి చెడు కేలరీలు, కొవ్వు అందుతాయి కానీ.. అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్‌ వంటివి అస్సలు లభించవు. మన జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా, తిన్న ఆహారం సక్రమంగా అరగాలన్నా.. భోజనానికి-భోజనానికి మధ్య కొంత సమయం అవసరం. కానీ నిరంతరం ఏదో ఒకటి నములుతూ ఉండటం వల్ల పొట్టకు అసలు విశ్రాంతే దొరకదు. దీనివల్ల జీవక్రియల్లో అసమతుల్యత ఏర్పడి.. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. రోజంతా ఏదో ఒకటి తింటూ ఉండటం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి, కాలక్రమేణా విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే, టైప్-2 డయాబెటిస్ బారిన పడటానికి కారణమవుతుంది. తీసుకున్న ఆహారానికి తగినంత శారీరక శ్రమ లేకపోతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గి, టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, నెలసరి క్రమం తప్పడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ర్యాట్ స్నాకింగ్ అనేది ఒక రకమైన ఈటింగ్ డిజార్డర్ లాంటిదే. మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సులభంగా అధిగమించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజులో మూడు పూటలా పోషకాలు ఉన్న ఆహారం అంటే తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, ప్రొటీన్లు కడుపునిండా తినాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండి, మధ్య మధ్యలో జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక సహజంగానే తగ్గుతుంది. కార్బోహైడ్రేట్లతో పోల్చితే ప్రొటీన్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీ డైట్‌లో ప్రొటీన్లు పుష్కలంగా లభించే పాలు, పాల పదార్థాలు, నట్స్, కోడిగుడ్లు వంటివి చేర్చుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో జంక్ ఫుడ్స్ వైపు మనసు మళ్లదు. ఒకవేళ భోజనానికి భోజనానికి మధ్యలో నిజంగానే ఆకలి వేస్తే.. చిప్స్, బిస్కెట్లకు బదులుగా గుప్పెడు బాదం, జీడిపప్పు, తాజా పండ్లు, లేదా మొలకెత్తిన గింజలను స్నాక్స్‌గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భోజనం అనేది..సమయం చూసుకుని… ప్రశాంతంగా, నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోవాలి. తినే ఆహారాన్ని బాగా నమలాలి. కనీసం 20 నిమిషాల సమయాన్ని భోజనానికి కేటాయించాలి. తింటున్నప్పుడు ఫోన్లు చూడటం, టీవీలు చూడటం పూర్తిగా మానేయాలి. దీనివల్ల మనం ఎంత తింటున్నామనే అవగాహన ఉంటుంది. బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలు త్వరగా రక్తంలోకి చేరుతాయి. చాలామంది బోర్ కొట్టడం వల్లో లేదా ఆఫీస్ ఒత్తిడి వల్లో తెలియకుండానే స్నాక్స్ తింటూ ఉంటారు. దీనిని అధిగమించాలంటే… కంటి నిండా నిద్రపోవాలి. ధ్యానం , యోగా వంటివి చేస్తూ ఉండాలి. ప్రతీ రోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఎనర్జిటిక్‌గా మారడమే కాకుండా హార్మోన్లు అదుపులో ఉంటాయి. అయితే, మితిమీరి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదు. మన శరీరానికి, తిన్న ఆహారానికి తగ్గట్టుగా వర్కవుట్స్ ఉండేలా చూసుకోవాలి. కేవలం సరదా కోసం లేదా టైంపాస్ కోసం అలవాటయ్యే ‘ర్యాట్ స్నాకింగ్’ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో అర్ధమైంది కదా. కాబట్టి, ‘ఏ సమయంలో తింటున్నాం.. ఏం తింటున్నాం’ అనే స్పృహతో ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. సాధ్యమైనంతవరకు భోజనంలో కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని దూరం పెట్టి, సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ వింత అలవాటు నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు క్లియర్ గా చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్‌ ఎందుకు చనిపోతుంది? నమ్మలేని నిజాలు..

‘ఫ్రెంచ్ సండే’ ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే

అద్భుతాన్ని కనిపెట్టి.. సీక్రెట్‌ మెయిన్‌టైన్ చేసిన ఇస్రో!

కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా

Follow Us