మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో

Updated on: Apr 20, 2026 | 5:20 PM

బెంగళూరులో పిల్లి పిల్లల కస్టడీ కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన వింత వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడ పిల్లి యజమాని మగ పిల్లి యజమానిపై బాధ్యత మోపగా, పోలీసులు జోక్యం చేసుకున్నారు. రెండు పిల్లి పిల్లలను ఒక్కో కుటుంబానికి ఇవ్వడంతో ఈ 'పిల్లి పోరు'కు సామరస్యంగా పరిష్కారం లభించింది. పెంపుడు జంతువులకు స్టెరిలైజేషన్ ఆవశ్యకతపై నెటిజన్లు చర్చించారు.

బెంగళూరులో పిల్లి పిల్లల బాధ్యత కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఓ వింత కస్టడీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మామూలుగా ఆస్తుల కోసం లేదా విడాకుల సమయంలో పిల్లల కస్టడీ కోసం గొడవలు పడటం చూస్తుంటాం.. కానీ బెంగళూరులో పిల్లి పిల్లల బాధ్యత కోసం రెండు కుటుంబాలు తీవ్రంగా వాదించుకున్నారు. వీరి పోరు పడలేక ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. బెంగళూరులోని శేషాద్రిపురంలో ఇరుగుపొరుగు వ్యక్తులు ఒకరు ఆడ పిల్లిని… మరొకరు మగ పిల్లిని పెంచుకుంటున్నారు. ఆదివారం ఆడపిల్లి నాలుగు పిల్లలను ఈనింది. పిల్లి పిల్లల గొడవ తట్టుకోలేకో ఏమో… ఆ ఇంటి యజమాని కోపంతో పక్కింటిలోని మగపిల్లి యజమానితో గొడవపడ్డాడు. ‘మా ఇంటిలోని ఆడపిల్లి నాలుగు పిల్లలను కన్నది. దానికి మీ మగ పిల్లే కారణం. కాబట్టి ఆ పిల్లలను సాకే బాధ్యత నీదే’ అంటూ ఆ పిల్లి పిల్లలను తీసుకొచ్చి వారి ఇంట్లో వదిలేశాడు. దీంతో ఇరు కుటుంబాలు రగడకు దిగాయి. అది తీవ్రమవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ముందు ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే నవ్వుకున్నారు. రెండు కుటుంబాలకు నచ్చజెప్పి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. పిల్లి పిల్లలను ఎవరూ బలవంతంగా పెంచుకోవాల్సిన అవసరం లేదని, వాటిని ఎవరైనా ఇష్టపడితే మూడో వ్యక్తికి దత్తత ఇవ్వాలని సూచించారు.ఈ రెండు కాకుండా మూడో ఆప్షన్‌ కూడా వారి ముందుంచారు. ఆ నాలుగు పిల్లి పిల్లలను రెండేసి చొప్పున ఇద్దరికీ ఇచ్చి పెంచాలని సూచించి ‘పిల్లి పోరు’ను తీర్చారు. దీనికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పిల్లి పిల్లలను కొత్త ఇంటికి తరలించారు. ఈ వింత ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పుట్టిన వెంటనే తల్లి పిల్లి నుంచి పిల్లలను ఎలా దూరం చేస్తారని, కనీసం నాలుగు వారాలైనా వేచి చూడాల్సిందని కొందరు తప్పుబట్టారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, పెంపుడు జంతువులకు తప్పనిసరిగా స్టెరిలైజేషన్ చేసేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురావాలని ఇంకొందరు నెటిజన్లు డిమాండ్ చేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే

మన ఉసిరి చెట్టుకి.. మలక్కా జలసంధికీ ఏంటా సంబంధం ?

Prakash Raj Vs Vijay: TVK చీఫ్ గాలి తీసిన ప్రకాశ్ రాజ్

Naga Babu: రామ నామాన్ని ఎగతాళి చేస్తే నాశనమైపోతావ్

‘ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..’ ఆహాలో మంచి సిరీస్

Follow Us