పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది? నమ్మలేని నిజాలు..
తల్లి ఆక్టోపస్ జీవితం ప్రకృతిలోని అత్యంత విషాదకర అద్భుతాల్లో ఒకటి. గుడ్లు పెట్టిన తర్వాత అది ఆహారం మానేసి పూర్తిగా పిల్లల సంరక్షణకే అంకితమవుతుంది. ఆప్టిక్ గ్రంథుల నుంచి విడుదలయ్యే హార్మోన్లు దాని శరీరాన్ని నెమ్మదిగా నాశనం చేస్తాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఇది ప్రకృతి నిర్దేశించిన ‘మరణ ఆదేశం’లా పనిచేస్తుందని తేలింది.
ప్రకృతిలో కొన్ని జీవుల మరణం ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో తల్లి ఆక్టోపస్ జీవితం ఓ విషాద గాథ. తన పిల్లల జననం కోసం అది తన మరణ శాసనాన్ని తనే రాసుకుంటుంది. గుడ్లు పెట్టిన క్షణం నుంచి దాని శరీరం నెమ్మదిగా స్వయం-విధ్వంసం వైపు ప్రయాణిస్తుంది. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగే ఓ క్రూరమైన, అదే సమయంలో అంచనాలకు అందని ఓ అద్భుతమైన ప్రక్రియ. గుడ్లు పెట్టగానే ఆడ ఆక్టోపస్ ఆహారం తీసుకోవడం, వేటాడటం వంటి పనులన్నీ పూర్తిగా మానేస్తుంది. తన పూర్తి సమయాన్ని, శక్తిని ఆ గుడ్లను కాపాడటానికే కేటాయిస్తుంది. ఈ మార్పుకు కారణం దాని కళ్ల వెనుక ఉండే ‘ఆప్టిక్ గ్రంథులు’. గుడ్లు పెట్టిన వెంటనే ఆ గ్రంథులు కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు, స్టెరాయిడ్లను విడుదల చేస్తాయి. అవి శరీరాన్ని లోపలి నుంచి నాశనం చేయడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో కొలెస్ట్రాల్ జీవక్రియకు సంబంధించిన జన్యువులు అత్యంత చురుగ్గా మారతాయనీ షికాగో యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా 7-డీహెచ్ సీ అనే రసాయనం ఈ మరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందట. ఆ మరణం తప్పనిసరి కాదని, అదొక ఆదేశమని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. 1977లో జెరోమ్ వోడెన్స్కీ అనే శాస్త్రవేత్త గుడ్లు పెట్టిన ఆక్టోపస్‌లకు ఆప్టిక్ గ్రంథులను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఆశ్చర్యకరంగా, ఆ ఆక్టోపస్‌లు మళ్లీ ఆహారం తీసుకోవడం మొదలుపెట్టి, దాదాపు ఆరు నెలల పాటు అదనంగా జీవించాయి. దీన్ని బట్టి ఆ గ్రంథులు లేకపోతే ‘మరణ ఆదేశం’ అమలు కాదని స్పష్టమైంది. ఒక్కసారి పునరుత్పత్తి జరిపి చనిపోయే ఆ విధానాన్ని ‘సెమెల్‌పారిటీ’ అంటారు. ఆకలితో క్షీణిస్తున్నప్పటికీ, తల్లి ఆక్టోపస్ తన ఉనికితోనే గుడ్లకు రక్షణ కల్పిస్తుంది. దాని మరణం తర్వాత ఆ ప్రాంతం తన పిల్లల మనుగడకు అనువుగా మారుతుంది. ఏ జన్యువులైతే తల్లి మరణానికి కారణమవుతాయో, అవే జన్యువులు సంతానం ద్వారా తర్వాతి తరానికి బదిలీ అవుతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఫ్రెంచ్ సండే’ ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
