చెట్టుపైనుంచి నోట్ల వర్షం.. అసలేం జరిగిందో మీరే చూడండి!
హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో ఓ కోతి రూ.81,800 నగదును ఎత్తుకెళ్లి చెట్టుపై నుంచి నోట్లను కిందకు విసిరేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో స్థానికులు, సిబ్బంది కిందపడిన డబ్బును సేకరించి బాధితుడికి అందించారు. అయితే కోతి నోట్లను చించేయడంతో రూ.1,500 నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఆహార పదార్థాల కోసం మనుషులపై దాడి చేసే కోతులు, ఈసారి ఏకంగా వేలాది రూపాయల నగదు కట్టను ఎత్తుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాయి. అంతటితో ఆగకుండా చెట్టుపైకి ఎక్కి నోట్ల వర్షం కురిపించింది ఓ వానరం. షిమ్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఘటన జరిగింది. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేయడం కోసం రూ. 81,800 నగదును ఒక బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకెళ్తున్నాడు. డీసీ కార్యాలయ ఆవరణలో నడుస్తుండగా, అకస్మాత్తుగా ఒక కోతి అతనిపై దాడి చేసింది. బాధితుడు తేరుకునేలోపే రెప్పపాటులో బ్యాగ్‌లోని డబ్బు కట్టను లాక్కొని, సమీపంలో ఉన్న ఒక ఎత్తైన చెట్టుపైకి చకచకా ఎక్కేసింది. చేతిలో ఉన్న నగదును కోతి ఎత్తుకెళ్లడంతో బాధితుడు ఒక్కసారిగా కంగారుపడ్డాడు. ఏం చేయాలో తోచక చెట్టు కింద నిలబడి దీనంగా చూస్తూ ఉండిపోయాడు. చెట్టు కొమ్మపై కూర్చున్న ఆ కోతి, నోట్ల కట్టను విప్పి ఒక్కొక్క నోటును కిందకు విసరడం ప్రారంభించింది. గాలిలో తేలుతూ కిందకు పడుతున్న రూ. 500 నోట్లను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. అయితే, బాధితుడి నిస్సహాయతను గమనించిన డీసీ కార్యాలయ సిబ్బంది, స్థానికులు మానవత్వంతో స్పందించారు. ఎవరూ ఆ డబ్బును తీసుకోకుండా, కింద పడిన నోట్లన్నింటినీ జాగ్రత్తగా ఏరి బాధితుడికి అందించారు. కోతి తన దగ్గరున్న నోట్లన్నీ కిందకు విసిరేసే వరకు అందరూ ఓపికగా ఎదురుచూశారు. చివరకు కింద పడిన నోట్లన్నింటినీ సేకరించి లెక్కించగా, మొత్తం సొమ్ములో రూ. 1,500 తక్కువగా ఉన్నట్లు బాధితుడు గుర్తించాడు. కోతి కొన్ని రూ. 500 నోట్లను తన పళ్లతో చించివేయడంతో ఆ మేరకు నష్టం జరిగిందని అతను తెలిపాడు. షిమ్లా నగరంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ప్రజల చేతుల్లోని వస్తువులను లాక్కెళ్తున్నాయని, ఏకంగా ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోందని వారు అంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కోతుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో కేసు
ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో కేసు
వైరల్ ఇన్ఫెక్షన్కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
పిజ్జా, బర్గర్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. కేఎఫ్‌సీ, డొమినోస్ కిచెన్లలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు!
