అమలాపురంలో అద్భుతం.. కొబ్బరికాయ నుంచి మొలిచిన రావిచెట్టు..

Updated on: Nov 16, 2026 | 5:10 PM

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కొబ్బరికాయ నుంచి రావి మొక్క మొలకెత్తిందన్న ఘటన స్థానికంగా ఆసక్తిని కలిగిస్తోంది. కార్తీకమాసంలో ఈ అరుదైన దృశ్యం కనిపించడంతో భక్తులు దైవ మహిమగా భావిస్తున్నారు. మొక్కను సాయిబాబా ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలో వ్యాఘ్రేశ్వరం శివాలయ ప్రాంగణంలో నాటాలని స్థానికులు నిర్ణయించినట్లు సమాచారం.

ప్రస్తుతం కార్తీకమాసం నడుస్తోంది. ఈ నెలలో భక్తులు శివకేశవులను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. కొబ్బరికాయను పరమశివుడిగా, రావిచెట్టును శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు. ఇదిలా ఉంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఓ అద్భుత ఘటన జరిగింది. అమలాపురం పట్టణంలోని మోబర్లిపేట బ్రహ్మానందం వీధిలో నివసిస్తున్న శ్రీనివ విశ్వేశ్వరరావు ఇంట్లో ఒక కొబ్బరికాయ నుంచి రావిచెట్టు మొక్క మొలిచిందన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున అక్కడికి తరలివస్తున్నారు. పవిత్రమైన కార్తీకమాసం వేళ ఇలాంటి అరుదైన ఘటన చోటుచేసుకోవడం సాక్షాత్తు ఆ శివకేశవుల మహిమేనని స్థానికులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాలనీవాసులు, భక్తులు రావిచెట్టు మొలిచిన ఆ కొబ్బరికాయ మొక్కను విశ్వేశ్వరరావు ఇంటి వద్ద నుంచి సమీపంలోని సాయిబాబా ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ ఆ మొక్కను ఉంచి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం రావిచెట్టులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారని భక్తులు విశ్వసిస్తారని స్థానికులు చెప్పుకుంటున్నారు. అలాంటి పవిత్రమైన రావి మొక్క, అది కూడా కార్తీకమాసంలో కొబ్బరికాయ నుంచి ఉద్భవించడం దైవ సంకల్పమేనని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ మొక్కను అత్యంత పవిత్రంగా చూసుకుంటూ భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం సాయిబాబా గుడిలో పూజలు అందుకుంటున్న ఈ రావి మొక్కను, త్వరలోనే ఏకాదశ రుద్రులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వ్యాఘ్రేశ్వరం శివాలయానికి అప్పగించాలని స్థానికులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో ఈ మొక్కను నాటి సంరక్షించాలని వారు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో కేసు

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

పిజ్జా, బర్గర్ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. కేఎఫ్‌సీ, డొమినోస్ కిచెన్లలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు!

Loading...
Unable to load recommendations.
Follow Us