Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం

Updated on: Mar 05, 2026 | 9:54 AM

ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల వద్ద అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పాముకు ఆహారమైన కప్పే, పామును మింగడానికి ప్రయత్నించింది. శ్రీవారి మాధవుని కుంట వద్ద జరిగిన ఈ అనూహ్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కప్ప పెద్ద పామును పట్టుకుని మింగేందుకు పడిన పాట్లు స్థానికులను ఆశ్చర్యపరిచాయి. ఇది కలికాలం అంటూ పలువురు వ్యాఖ్యానించారు.

సాధారణంగా పామును చూడగానే కప్ప గడగడలాడుతుంది.. ప్రాణభయంతో పారిపోతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది! వేటాడాల్సిన పామే బాధితురాలిగా మారింది.. ఆహారం కావాల్సిన కప్పే వేటగాడిగా అవతారమెత్తింది. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి మాధవుని కుంట వద్ద జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అనే సామెత మనకు తెలుసు. కానీ ఇక్కడ కప్పకు వచ్చిన కోపం పాము ప్రాణాల మీదకు తెచ్చింది. సాధారణంగా పాములు కప్పలను మింగడం ప్రకృతి సహజం. కానీ, ఈ ఘటనలో ఒక చిన్న కప్ప ఏకంగా ఒక పామునే నోటకరిచి మింగేయడానికి ప్రయత్నించింది. తన శరీరం కంటే పెద్దగా ఉన్న పామును ఏమాత్రం భయం లేకుండా నోటితో గట్టిగా పట్టుకుంది. ప్రాణం మీదకు వస్తే ఏదైనా తెగిస్తుందన్నట్లు.. తనకు ఎదురైన పామును ఆ కప్ప వదలలేదు. పామును సగానికి పైగా మింగేసిన కప్ప, తోక భాగం వచ్చేసరికి పొట్ట నిండిపోవడంతో ఆగిపోయింది. అటు మింగలేక, ఇటు బయటకు వదలలేక ఆ కప్ప పడిన పాట్లు చూసి స్థానికులు విస్తుపోయారు. కాలువలో జరిగిన ఈ పోరాటాన్ని చూసిన భక్తులు, స్థానికులు ఆశ్చర్యంతో తమ ఫోన్లలో బంధించారు. కలికాలం అంటే ఇదేనేమో.. కప్ప వచ్చి పామును కరుస్తోంది అంటూ సరదాగా వ్యాఖ్యానించుకున్నారు. ప్రస్తుతం ఈ ‘రివర్స్ వేట’కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Walking: భోజనం చేసిన వెంటనే నడవడం మంచిదా.. కాదా..?

Loading...
Unable to load recommendations.
Follow Us