మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..

Updated on: Apr 24, 2026 | 4:20 PM

జిమ్, ప్రొటీన్ షేక్‌లు లేకుండా కండలు తిరిగిన దేహంతో ఉండవచ్చని చెన్నై భవన నిర్మాణ కార్మికుడు నిరూపించాడు. రోజువారీ శారీరక శ్రమతో పాటు వారానికి ఐదు రోజులు వ్యాయామం, సాంబార్-రసంతో కూడిన అన్నం, ఇంట్లో వండిన ఆహారం, తగిన నిద్ర, క్రమశిక్షణే తన ఫిట్‌నెస్‌కు మూలమంటాడు. ఎటువంటి సప్లిమెంట్లు లేకుండానే అతను ఆరోగ్యంగా, బలంగా ఉన్నాడు. ఈ దేశీ ఫిట్‌నెస్ రహస్యాలు అందరికీ ఆదర్శం.

ఫిట్‌గా, కండలు తిరిగిన దేహంతో ఉండాలంటే జిమ్‌కు వెళ్లాలి, ప్రొటీన్ షేక్‌లు తాగాలి, కఠినమైన డైట్ పాటించాలని చాలామంది అనుకుంటారు. కానీ, చెన్నైలోని ఓ భవన నిర్మాణ కార్మికుడు ఈ అపోహలన్నింటినీ బద్దలు కొడుతున్నాడు. రోజంతా ఎండలో కష్టపడి పనిచేసే ఆ కార్మికుడి శరీరాకృతి, కండలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అతను పంచుకున్న ఫిట్‌నెస్‌ రహస్యాల వీడియో నెట్టింట‌ వైరల్ అవుతోంది. రోజంతా శారీరక శ్రమ చేసినప్పటికీ, ఆ కార్మికుడు వారానికి ఐదు రోజులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాడట. తన వర్కౌట్ ప్లాన్‌ను వివరిస్తూ.. “సోమవారం చెస్ట్, మంగళవారం షోల్డర్, బుధవారం బ్యాక్, గురువారం బైసెప్స్-ట్రైసెప్స్, శుక్రవారం లెగ్స్ వర్కౌట్ చేస్తానని చెప్పాడు. క్రమశిక్షణే తన ఫిట్‌నెస్‌కు మూలమని అతనన్నాడు. ఆశ్చర్యకరంగా కండలు పెంచడానికి చాలామంది దూరంగా ఉండే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్నే ఇతను తీసుకుంటాడు. రోజంతా పనిచేయడానికి కావాల్సిన శక్తి కోసం రోజుకు మూడు పూటలా అన్నం తింటానని చెప్పాడు. మూడు పూటలా అన్నం మాత్రమే తింటాననీ సాంబార్, రసం, బీట్‌రూట్, క్యారెట్ తో చేసిన కూరలు తీసుకుంటాననీ అన్నాడు. ఇడ్లీ, దోశ వంటివి తినననీ తెలిపాడు. వారానికి ఒకసారి మాత్రమే మటన్ తింటానని, చికెన్ , చేపలు ముట్టనని అతను తెలిపాడు. తాను ఎలాంటి స్టెరాయిడ్స్ కానీ, వే ప్రొటీన్ వంటి కమర్షియల్ సప్లిమెంట్స్ కానీ ఎప్పుడూ తీసుకోలేదని ఆ భవన నిర్మాణ కార్మికుడు స్పష్టం చేశాడు. “పనిచేస్తాను, తింటాను, జిమ్‌కు వెళతాను… అంతే!” అని సింపుల్‌గా చెప్పాడు. ప్రతి రోజూ కనీసం 7 గంటలు నిద్రపోతానని, ఇంట్లో వండిన ఆహారాన్నే తింటానని చెప్పాడు. జంక్ ఫుడ్, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చాడు. వంద శాతం నిబద్ధతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ కార్మికుడి జీవనశైలి నిరూపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రసగుల్లా తింటే పక్షవాతం ఖాయమా? డాక్టర్లు ఏం చెప్పారు?

Follow Us