రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రమాదకర స్టంట్స్!
వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డుపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు థార్ కారుతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రీల్స్ చిత్రీకరించడం వివాదాస్పదమైంది. భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధ్యతారాహిత్యంగా స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్ వికారాబాద్ అనంతగిరి హిల్స్. వీకెండ్ వస్తే చాలు పర్యాటకులు, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో ఈ ప్రాంతం ఎంతో ఆథ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. అయితే, సుప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి వెలసిన ఈ పవిత్ర పుణ్యక్షేత్ర పరిసరాల్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ‘ఉప్పల్ బాలు’ చేసిన వింత చేష్టలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. పర్యాటక ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన తీరుపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డుపై ఉప్పల్ బాలు ఒక ‘థార్’ కారుతో ఏం చేశాడో తెలుసా? ప్రమాదకరమైన మలుపులు ఉండే ఘాట్ రోడ్డుపై కారుతో స్టంట్లు చేస్తూ రీల్స్ క్రియేట్ చేశాడు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఘాట్ రోడ్డుపై, ఇలా బాధ్యతారాహిత్యంగా కారుతో విన్యాసాలు చేయడం వల్ల సాధారణ ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏమాత్రం తేడా వచ్చినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే అనంత పద్మనాభస్వామి సన్నిధికి కొద్ది దూరంలోనే ఈ తతంగం అంతా జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పర్యాటకులు ఎవరైనా తమ చిన్న కెమెరాలతో ప్రకృతిని ఫోటోలు తీస్తే చాలు.. రూల్స్ అంటూ, కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించే అటవీ శాఖ, పోలీస్ అధికారులు.. ఇప్పుడు ఉప్పల్ బాలు అంత బహిరంగంగా స్టంట్స్ చేస్తుంటే ఏం చేస్తున్నారని స్థానికులు నిలదీస్తున్నారు. ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మికతకు నెలవైన అనంతగిరి కొండల్లో ఇలాంటి వింత చేష్టలు, న్యూసెన్స్ రికార్డింగ్స్ పెరిగిపోతుండటం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ రోడ్డుపై ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేలా ప్రవర్తించిన ఉప్పల్ బాలు పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వికారాబాద్ పోలీసులు ఇప్పటికే ఉప్పల్ బాలుపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా భారతీయులు కాదా? పౌరసత్వానికి అసలైన రుజువు ఏంటి?
చైనాకు కౌంటర్‌గా .. భారత్ అతి పెద్ద డ్యామ్ నిర్మాణం
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!
