అరకు అందాలకు పర్యాటకులు ఫిదా.. డాన్సులతో అలరించిన గిరిజనులు

Updated on: Nov 18, 2026 | 7:20 PM

అరకులోయలో చలితో పాటు పొగమంచు అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అరకు, పాడేరు ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో కొండలు మంచు తెరల్లో కనువిందు చేస్తున్నాయి. మాడగడ మేఘాల కొండపై సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అయితే తుఫాన్ కారణంగా వంజంగి కొండకు వెళ్లే రహదారి దెబ్బతినడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయ పాలసముద్రాన్ని తలపించింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు, ప్రకృతి సోయగాలతో మన్యం ప్రాంతం సరికొత్త అందాలను సంతరించుకుంది. ఈ ఏడాది శీతాకాలం సీజన్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం మారిన ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం కనిష్టంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. కొండలు, ఘాట్ రోడ్లను కప్పేసిన మంచు తెరల నడుమ ప్రయాణిస్తూ సందర్శకులు ఈ ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధించారు.. వీకెండ్ కావడంతో అరకులోయకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో స్థానిక హోటళ్లు, రిసార్టులు, లాడ్జిలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మాడగడ మేఘాల కొండకు పర్యాటకులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దట్టమైన మంచు తెరలను చీల్చుకుంటూ కొండల వెనుక నుంచి ఉదయిస్తున్న సూర్యుడిని చూసేందుకు తెల్లవారుజాము నుంచే సందర్శకులు మాడగడకు చేరుకున్నారు. ఆ సుందర సూర్యోదయ దృశ్యాలను చూసి కేరింతలు కొడుతూ ఆనందించారు. మరోవైపు, మాడగడకు వచ్చిన పర్యాటకులకు స్థానిక గిరిజన కళాకారులు తమ సంప్రదాయ ‘థింసా’ నృత్యంతో ఘన స్వాగతం పలుకుతున్నారు. గిరిజనులతో కలిసి పర్యాటకులు కూడా ఉత్సాహంగా థింసా నృత్యం చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే, పర్యాటకులకు వంజంగి కొండ విషయంలో కాస్త నిరాశ ఎదురైంది. ఇటీవల కురిసిన తుఫాన్ కారణంగా వంజంగి కొండకు వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆ మార్గంలో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఫలితంగా, ప్రకృతి ప్రేమికులు కొందరు కిలోమీటర్ల మేర కాలినడకనే వంజంగి కొండకు వెళ్తుండగా, నడవలేని మరికొందరు పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మొత్తానికి మంచు సోయగాలతో అరకులోయ పర్యాటకులతో కళకళలాడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు

సీతాఫలం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ విషయాలు అస్సలు మిస్ అవ్వకండి!

జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!

స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచులు.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్‌..

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా.. అల్వాల్‌ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

Loading...
Unable to load recommendations.
Follow Us