చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ

Updated on: Mar 25, 2026 | 4:54 PM

రాత్రిపూట సూర్యకాంతిని విక్రయించే 'రిఫ్లెక్ట్ ఆర్బిటల్' సంస్థ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఉపగ్రహాలలోని అద్దాలతో $6,000కు ఒక గంట వెలుగును అందిస్తోంది. 24/7 విద్యుత్ ఉత్పత్తి, విపత్తు సహాయం, ఈవెంట్ లైటింగ్ దీని లక్ష్యాలు. అయితే, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు జంతువుల జీవ గడియారం, అంతరిక్ష పరిశోధనలపై దీని ప్రతికూల ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు.

ప్రకృతి ప్రసాదించిన గాలిని ఇప్పటికే బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నారు.. తాగే నీటిని క్యాన్లలో నింపి వ్యాపారం చేస్తున్నారు.. ఇక ఇప్పుడు వంతు సూర్యుడిది! రేపటి రోజున సూర్యరశ్మి కూడా ఉచితం కాదు. రాత్రి పూట మీకు సూర్యకాంతి కావాలంటే గంటకు 6,000 డాలర్లు చెల్లించాల్సిందే… మన కరెన్సీలో చూస్తే.. ఐదు లక్షల పైమాటే. అమెరికాకు చెందిన ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే స్టార్టప్ కంపెనీ ‘సూర్యకాంతిని అమ్ముతాం’ అంటూ ప్రకటించి ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. చీకటి పడ్డాక సూర్యుడు కనిపించడు కదా.. మరి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే అసలు సిసలైన టెక్నాలజీ ఉంది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలకు భారీ పరిమాణంలో ఉండే అల్ట్రా-రిఫ్లెక్టివ్ అద్దాలను అమరుస్తారు. సూర్యుడు భూమికి అవతలి వైపు ఉన్నప్పుడు, ఈ అద్దాలు సూర్యకాంతిని పరావర్తనం చెందించి, సరిగ్గా మీరు కోరుకున్న ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రదేశంపైకి మళ్లిస్తాయి. అంటే, ఆ ప్రాంతంలో ఉన్న వారికి రాత్రి పూట కూడా పగటి వెలుగు కనిపిస్తుంది. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కధలా ఉన్నా, రిఫ్లెక్ట్ ఆర్బిటల్ దీనిని సాకారం చేస్తోంది. కేవలం సరదా కోసం వెలుగును కొనడం కాదు.. దీని వెనుక పెద్ద బిజినెస్ ప్లానే ఉంది. ప్రస్తుతం సోలార్ ప్యానెల్స్ కేవలం పగలు మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ టెక్నాలజీతో రాత్రి కూడా ఎండను సృష్టించి 24 గంటలూ కరెంటును తయారు చేయవచ్చు. రాత్రి పూట జరిగే ఖరీదైన అవుట్‌డోర్ పార్టీలు, షూటింగ్‌లు లేదా స్టేడియాల్లో లైటింగ్ కోసం లక్షల రూపాయల కరెంటు ఖర్చవుతుంది. దానికి బదులు ఈ ‘నేచురల్ సన్‌లైట్’ను అద్దెకు తీసుకోవచ్చు. భూకంపాలు లేదా వరదలు వచ్చిన విపత్తుల వేళ రాత్రి పూట సహాయక చర్యలు చేపట్టడానికి ఈ వెలుగు ప్రాణవాయువులా మారుతుంది. ఈ ప్రయోగంపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. రాత్రి పూట కృత్రిమంగా వెలుగును సృష్టించడం వల్ల పక్షులు, జంతువుల జీవ గడియారం అస్తవ్యస్తమవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, టెలిస్కోపుల ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఈ ‘అద్దాల వెలుగు’ పెద్ద అడ్డంకిగా మారుతుందని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లు అసలు మనుషులేనా ?? యజమానుల నిర్లక్ష్యం మరీ ఇంత దారుణం జరిగింది

ఏప్రిల్ 1 నుంచి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా ??

దడపుట్టించే సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది.. చూడటం మొదలు పెడితే కళ్ళు తిప్పరంతే

Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్

మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ

Follow Us