హైదరాబాద్ నెంబర్ 1.. ఢిల్లీ, బెంగళూరుది బ్యాక్ బెంచ్.. అసలు నిజమేంటి?
కేంద్రం విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో హైదరాబాద్ ఐదు ప్రధాన మెట్రో నగరాలను వెనక్కి నెట్టి గుర్తింపు సాధించింది. 200 మార్కులకు 174.2 పాయింట్లు సాధించి 19వ ర్యాంక్ దక్కించుకుంది. సంగారెడ్డి, నల్గొండ కూడా తమ విభాగాల్లో మంచి స్థానాలు పొందాయి. ఈ ర్యాంకుల వెనుక ఉన్న కారణాలు, కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తెలుసుకుందాం.
ఢిల్లీలో ఊపిరి ఆడక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బెంగళూరు.. ట్రాఫిక్ పొగతో ఉడికిపోతోంది. ముంబై, చెన్నై, కోల్‌కతా.. ఇలా దేశంలోని మహా నగరాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ నివేదికే.. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026. ఈ సర్వేలో దేశంలో మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలను వెనక్కి నెట్టి.. హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. వినడానికి చాలా గర్వంగా ఉంది కదూ? మన హైదరాబాద్ గ్రేట్.. మన గాలి స్వచ్ఛమైనది అని సంబరపడిపోవడానికి ఇదొక గొప్ప వార్తలా కనిపిస్తోంది. కానీ.. ఇక్కడే మనం ఆగాలి. ఒక్కసారి లోతుగా ఆలోచించాలి. ఇంతకీ ఈ ఘనత ఎలా సాధ్యమైంది? హైదరాబాద్‌కు ఎన్ని మార్కులు వచ్చాయి? నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? తెలంగాణలోని మరో రెండు నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన ఈ సర్వేలో పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో 19వ ర్యాంక్ వచ్చింది. మొత్తం 200 మార్కులకు గాను భాగ్యనగరం 174.2 పాయింట్లు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది కూడా. ఇక మిగతా మెట్రోల పరిస్థితి చూస్తే.. ఢిల్లీ 21వ స్థానంలో, ముంబై 28, బెంగళూరు 32, చెన్నై 35, కోల్‌కతా 38వ స్థానాల్లో నిలిచాయి. అసలు ఈ సర్వేలో దేనిని పరిశీలిస్తారు? నిజంగానే హైదరాబాద్‌లో గాలి అంత స్వచ్ఛంగా ఉందా? అంటే. ఇక్కడే అసలు కిటుకు ఉంది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అనేది కేవలం గాలిలో కాలుష్యం ఎంత ఉందో కొలిచే మీటర్ కాదు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఆయా నగరాల స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అనే దానిపై ఇచ్చే మార్కులు ఇవి. అంటే.. రోడ్లపై దుమ్ము తొలగింపు, చెత్త నిర్వహణ, వాహనాల ఉద్గారాల నియంత్రణ, గ్రీనరీ పెంపకం.. ఇలాంటి అంశాలను బట్టి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. అంటే కేవలం నివేదికల్లో గణాంకాలు చూపిస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో కాలుష్య నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు కూడా కీలకంగా మారతాయి. ఇకపోతే, హైదరాబాద్‌కు ఈ గుర్తింపు రావడానికి కారణాలేంటి? అనే విషయానికి వస్తే.. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో గతంలో పనిచేసిన అధికారి, పర్యావరణవేత్త ప్రసన్న కుమార్ అభిప్రాయం ప్రకారం.. హైదరాబాద్‌కు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొన్ని సహజమైన అనుకూలతలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై లాగా ఒకే చోట ఇరుకుగా కాకుండా, హైదరాబాద్ విస్తరణ అనేది నలువైపులా వికేంద్రీకృతమై జరిగింది. దీనివల్ల కాలుష్యం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఉంది. అంతేకాదు, గాలిలో ఉండే ప్రమాదకరమైన పార్టిక్యులేట్ మ్యాటర్, బెంజీన్, సల్ఫర్ ఆక్సైడ్ల స్థాయిలు ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గర కొంత తక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఫలితాల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలతో పోలిస్తే హైదరాబాద్ మెరుగైన స్థానాన్ని సంపాదించింది. అంటే ఈ నగరాలన్నింటినీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్య, నిర్మాణ రంగం విస్తరణ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ హైదరాబాద్ ఈ గుర్తింపు పొందడం విశేషం. హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు రూ.100 కోట్లు కేటాయించారు. ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరిగితే డీజిల్, ఇతర ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. తద్వారా వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ కి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతోపాటు ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు మరో 30 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఒక్క ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకే కాకుండా, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తం మీద ఈ రెండు కార్యక్రమాల కోసం 130 కోట్ల రూపాయలు కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నగరంలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయడం కూడా కీలకంగా మారింది. ఆర్టీఏ, జీహెచ్ఎంసీ, పోలీస్ విభాగాలను ఒకే తాటిపైకి తెచ్చి, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ ద్వారా సమన్వయం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం, వాటి అమలును పర్యవేక్షించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. మరోవైపు నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. భవనాలపై గార్డెన్లు ఏర్పాటు చేయడం, టెర్రస్ గార్డెనింగ్‌ను ప్రోత్సహించడం, గ్రీన్ బిల్డింగ్స్ నిర్మించడం వంటి చర్యలు హైదరాబాద్ పర్యావరణాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెబుతున్నారు. ఇటు వార్డుల స్థాయిలో చూసినా.. రాష్ట్ర స్థాయి అవార్డుల పరంగా చూసుకున్నా.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, గన్‌ఫౌండ్రీ వార్డులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణలోని మరో రెండు నగరాలు కూడా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో మంచి ర్యాంకులు సాధించాయి. మూడు లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల విభాగంలో సంగారెడ్డి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. 200 పాయింట్లకు గానూ 186.8 పాయింట్లు సాధించింది. అదే విభాగంలో నల్గొండ పదో స్థానంలో నిలిచింది. ఈ నగరం 185.8 పాయింట్లు సాధించింది. అంటే రాష్ట్రంలోని మూడు నగరాలు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నాయి. ఈ 19వ ర్యాంక్ అనేది నగరం సమస్యలన్నీ తీరిపోయాయని చెప్పే సర్టిఫికెట్ కాదు. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఢిల్లీ లాంటి నగరాలను చూసైనా మేల్కొంటే.. భవిష్యత్తులో ఇంకా స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకునే అవకాశం ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమ కాదు.. పిచ్చి! రూ.7 కోట్లతో రూ.4,500 కోట్ల వండర్!
శీతాకాలంలో సంపూర్ణ ఆరోగ్యం.. తప్పక తీసుకోవాల్సిన పోషకాహారాలు ఇవే
పేడతోనే ఇన్ని అద్భుతాలా? 1,140 రెట్ల బలం.. ఈ పురుగు సొంతం! నక్షత్రాలే దీనికి దిక్సూచి
బ్యాంక్ ఖాతా లేకపోయినా మనీ పంపుకోవచ్చు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే
