Satyadev: ‘నన్ను హీరోగా తీసేయ్ అన్నారు.. RGV గారు అలా అంటారనుకోలేదు’

Updated on: Jun 02, 2026 | 5:26 PM

టాలీవుడ్‌లో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించారు. ‘జ్యోతిలక్ష్మి’ సినిమా సమయంలో రామ్ గోపాల్ వర్మ తనను హీరోగా మార్చేయాలని సూచించారని, అయితే సినిమా చూసిన తర్వాత తన నటనకు మెచ్చుకుని స్వయంగా క్షమాపణ చెప్పారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి, తన అద్భుతమైన నటనతో నేడు టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘సమవర్తి’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సత్యదేవ్ తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ఆరంభంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా నిర్మాణ సమయంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలోని ఒక పాటను చూసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పూరీ జగన్నాథ్‌తో “ఆ హీరోను మార్చేయ్.. లేదంటే సినిమా ప్లాప్ అవుతుంది” అని అన్నారట. ఈ విషయం తెలిసి సత్యదేవ్ తీవ్రంగా బాధపడ్డారు. కనీసం పూర్తి సినిమా కూడా చూడకుండా, కేవలం ఒక పాట చూసి వర్మ అలా ఎలా అంటారని చాలా ఫీలయ్యారట. అయితే ఆ తర్వాత కథ ఊహించని మలుపు తిరిగింది. ‘జ్యోతిలక్ష్మి’ పూర్తి సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ, సత్యదేవ్ నటనకు ఫిదా అయ్యారు. వెంటనే ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకుని.. “ఆరోజు నిన్ను మార్చేయమన్నందుకు సారీ.. నువ్వు చాలా బాగా చేశావ్” అంటూ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. ఆర్‌జీవీ లాంటి పెద్ద దర్శకుడు తన తప్పు తెలుసుకుని సారీ చెప్పడం తనను ఆశ్చర్యపరిచిందని సత్యదేవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సత్యదేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తాతయ్య పెద్ద దర్శకుడా? ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణలతో సినిమాలు చేశాడా?

Follow Us