Godari Gattupaina Review: డీసెంట్ ఎంటర్టైనర్ గోదారి గట్టుపైన రివ్యూ.. ఎలా ఉందంటే ??

Updated on: May 09, 2026 | 12:17 PM

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు నటించిన 'గోదారి గట్టుపైన' చిత్రం గ్రామీణ ప్రేమకథగా అలరించింది. గోదావరి జిల్లా నేపథ్యంలోని ఈ సినిమాలో రాజు, మాయల ప్రేమ, తండ్రి వ్యతిరేకత ముఖ్య కథాంశం. సుమంత్, జగపతిబాబు నటన సినిమాకు ప్రధాన బలం. కొన్ని లోపాలున్నా, ఇది ఒక డీసెంట్ విలేజ్ ఎంటర్టైనర్.

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గోదారి గట్టుపైన. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథలోకి వెళితే.. గోదావరి జిల్లాలోని ఓ అందమైన పల్లెటూరు. చదువు పెద్దగా అబ్బని రాజు అలియాస్ సుమంత్ ప్రభాస్ అదే ఊరిలో ఆటో నడుపుకుంటూ సరదాగా జీవిస్తుంటాడు. అదే ఊరికి చెందిన సత్యభామ అలియాస్ మాయ అలియాస్ నిధి ప్రదీప్‌తో రాజుకి పరిచయం ఏర్పడుతుంది. మొదట చిన్నపాటి గొడవలతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. మాయ తండ్రి అలియాస్ జగపతి బాబు తన కూతురంటే ప్రాణమిచ్చే వ్యక్తి. అడిగిందల్లా ఇస్తూ మహారాణిలా పెంచుతాడు. అయితే, కూతురి ప్రవర్తనలో వస్తున్న మార్పులను గమనించిన ఆయన, రాజుతో ఆమె ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకుంటాడు. కానీ కూతురు మీద ప్రేమతో ఆ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ప్రాణంగా ప్రేమించే తండ్రికి ఎదురుచెప్పలేక మాయ రాజుకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఈ పరిస్థితుల్లో రాజు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు తండ్రి మనసు మార్చి మాయను దక్కించుకున్నాడా లేదా? అనేది ఈ చిత్ర ప్రధాన కథ. తెలుగు ఇండస్ట్రీలో పల్లెటూరి ప్రేమ కథలు చాలానే వచ్చాయి. గోదారి గట్టుపైన కూడా అలాంటి ఒక సినిమానే. దర్శకుడు సుభాష్ చంద్ర ఎంచుకున్న పాయింట్ ఆసక్తికరంగా అనిపించింది. కులం, మతం లేదా అంతస్తుల అంతరాల వల్ల ప్రేమకు పెద్దలు అడ్డుపడటం అనేది మనం ఎన్నో దశాబ్దాలుగా చూస్తున్న ఫార్ములానే. కానీ ఈ సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కొత్తగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఫస్ట్ హాఫ్ అంతా పల్లెటూరి వాతావరణం, హీరో హీరోయిన్ల మధ్య చిన్న పిల్లల చేష్టల్లాంటి లవ్ ట్రాక్, స్నేహితుల మధ్య కామెడీతో కాస్త నెమ్మదిగా సాగుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టే సన్నివేశాలు కూడా చాలా సాధారణంగా ఉంటాయి. కొత్తగ ఉండేలా సీన్లు రాసుకోకపోవడం ఈ సినిమాలో మైనస్ అనే చెప్పాలి. సుదర్శన్ గ్యాంగ్ చేసే కామెడీ అక్కడక్కడా కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఒక చిన్న ఎమోషనల్ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌ పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సెకండాఫ్ పర్లేదనే చెప్పాలి. ఇలాంటి ప్రేమకథల్లో హీరోకి, హీరోయిన్ తండ్రికి మధ్య జరిగే ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. కానీ ఇందులో ఆ ప్రధాన సంఘర్షణే సింపుల్ గా తేల్చేశారు. ప్రేమను అడ్డుకునే తండ్రిగా జగపతిబాబు పాత్రను ఇంకాస్త స్ట్రాంగ్ గా డిజైన్ చేయాల్సింది. తదుపరి సన్నివేశం ఏంటనేది ప్రేక్షకుడు ముందే ఇట్టే పసిగట్టేసేంత సింపుల్ గా, ఎలాంటి మలుపులు లేకుండా ఫ్లాట్ గా సాగుతుంది స్క్రీన్ ప్లే. మళ్లీ క్లైమాక్స్ బాగానే అనిపిస్తుంది.. ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల చివర్లో దర్శకుడు రివీల్ చేసే ట్విస్టులు జస్ట్ ఓకే అనిపిస్తాయి. మరీ కొత్తగా అనిపించదు కానీ ఎమోషనల్ సినిమాలు చూడాలి అనుకునే వాళ్లకు పర్లేదు. మేం ఫేమస్ తర్వాత మరోసారి పల్లెటూరి కుర్రాడిగా, ఆటో డ్రైవర్ రాజు పాత్రలో సుమంత్ ప్రభాస్ చక్కగా ఒదిగిపోయాడు. గోదారి యాస పలకడంలో బాగా కష్టపడ్డాడు, అది తెరపై స్పష్టంగా వినిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన ఈజ్ తో సహజమైన నటన కనబరిచాడు. సినిమాకు ప్రధాన బలం అతనే. నిధి ప్రదీప్ కొత్త అమ్మాయి అయినప్పటికీ సహజంగా నటించే ప్రయత్నం చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదనిపించింది.. కూతురి కోసం తపించే తండ్రిగా, ప్రేమను వ్యతిరేకించే వ్యక్తిగా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు. ఆయన నటన అమ్మాయిల తండ్రులకు బాగా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ తల్లిగా సీనియర్ నటి లైలా కనిపించినా ఆమెకు పెద్దగా డైలాగ్స్ లేవు. సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి తమదైన కామెడీతో అక్కడక్కడా నవ్వించారు. దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల రొటీన్ పాత్రలు చేసినా, తమ పరిధి మేరకు న్యాయం చేశారు. నాగవంశీ పాటలు ఓకే అనిపిస్తాయి. బంగారు బొమ్మ పాట వినడానికి, చూడటానికి బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సాయి సంతోష్ కెమెరా వర్క్. గోదావరి జిల్లాల అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని చాలా కలర్ ఫుల్ గా, ఆకర్షణీయంగా క్యాప్చర్ చేశారు. అనిల్ పసల ఎడిటింగ్ కాస్త వీక్ ఉంది. కత్తెరకు ఇంకా చాలా పని చెప్పాల్సింది. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, అనవసరమైన ల్యాగ్ సీన్స్ తీసేసినా నష్టం లేదు. దర్శకుడు సుభాష్ చంద్ర కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. అభినవ్ రావు నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా బాగున్నాయి. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదని ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది. ఓవరాల్ గా గోదారి గట్టుపైన.. డీసెంట్ విలేజ్ ఎంటర్టైనర్..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం

Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

Follow Us