
భారతీయులకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాయ్ విడదీయరాని బంధంగా ఉంటుంది. రోడ్డు పక్కన ఉండే టాప్రీల నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు చాయ్ తాగనిదే చాలామందికి రోజు గడవదు. కేవలం ఇదొక పానీయం మాత్రమే కాదు.. మన దేశంలో అదొక ఎమోషన్, ఒక సంస్కృతి. ఇప్పుడు ఈ భారతీయ చాయ్ ఘుమఘుమలు ప్రపంచాన్ని చుట్టేసి గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించాయి. అంతర్జాతీయ ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో మన దేశానికి చెందిన మసాలా చాయ్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వార్త వినగానే మన చాయ్ లవర్స్ అందరూ మనకు ముందే తెలుసు కదా! అంటూ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు.
భారతీయుల ఇష్టమైన పానీయం మసాలా చాయ్ ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్‌అట్లాస్ (TasteAtlas) ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో భారతదేశానికి చెందిన మసాలా చాయ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని, ప్రపంచంలోనే అత్యుత్తమ టీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నప్పటికీ, మన మసాలా చాయ్‌కి ఉన్న క్రేజ్ వేరని ఈ రేటింగ్స్ నిరూపించాయి. ఘాటైన అల్లం, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాల కలయికతో పాలు, డికాషన్ కలిపి మరిగించే ఈ మసాలా చాయ్ రుచికి విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. ఈ గ్లోబల్ రేటింగ్‌లో జపాన్‌కు చెందిన ప్రసిద్ధ హోజిచా గ్రీన్ టీ రెండో స్థానంలో నిలవగా, శ్రీలంకకు చెందిన సిలోన్ బ్లాక్ టీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. అయితే వాటన్నింటినీ వెనక్కి నెట్టి మన దేశీ చాయ్ నంబర్ వన్ కిరీటాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
కేవలం మసాలా చాయ్ మాత్రమే కాదు.. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన మరికొన్ని చాయ్ రకాలు కూడా టాప్ 50లో చోటు సంపాదించుకున్నాయి. ఇందులో దార్జీలింగ్ టీ 6వ స్థానంలో, అస్సాం చాయ్ 13వ స్థానంలో నిలిచాయి. అలాగే కేరళకు చెందిన సులైమాని చాయ్ (39), హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రా టీ (41), జమ్మూ కాశ్మీర్‌కు చెందిన విలక్షణమైన ఉప్పు రుచితో కూడిన ‘నూన్ చాయ్’ (43) కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకుని భారతీయ టీ సంస్కృతిలోని వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి.
భారతదేశంలో చాయ్ అనేది ఒక ఉపాధి మార్గమే కాదు, స్నేహితుల ముచ్చట్లకు కేరాఫ్ అడ్రస్. రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై వేడి వేడి చాయ్ కప్పులు ఇచ్చే ఉపశమనం మాటల్లో చెప్పలేం. ‘టేస్ట్‌అట్లాస్’ నివేదిక ప్రకారం.. కేవలం టీ పొడి మాత్రమే కాకుండా, భారతదేశంలోని అత్యంత పురాతనమైన, చారిత్రాత్మకమైన టీ ఎస్టేట్లకు కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పశ్చిమ బెంగాల్‌లోని 1859 నాటి ప్రసిద్ధ మకైబరి టీ ఎస్టేట్, అస్సాంలోని శతాబ్దపు చరిత్ర కలిగిన హల్మారి టీ ఎస్టేట్ ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లుగా నిలిచాయి. మొత్తానికి గ్లోబల్ వేదికపై మన మసాలా చాయ్ నంబర్ వన్‌గా నిలవడంతో.. చాయ్ పే చర్చా ఇకపై కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా మొదలైందని చెప్పవచ్చు. చాయ్ ప్రియులారా.. మరి ఇంకెందుకు ఆలస్యం, వరల్డ్స్ బెస్ట్ టీతో ఒక సిప్ వేసి సెలబ్రేట్ చేసుకోండి!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..