
సాధారణంగా సెలబ్రిటీలు ఏ కార్యక్రమానికి హాజరైనా వారి అందం, దుస్తులు, మేకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ముఖ్యంగా అంబానీ కుటుంబానికి చెందిన వేడుకలు, వివాహాలు, ప్రత్యేక కార్యక్రమాల్లో నీతా అంబానీ ధరించే దుస్తులు, ఆభరణాలు, మేకప్ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. అయితే ఆమె అందమైన లుక్ వెనుక ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఓజాస్ రజనీ ఉన్నారు. ప్రస్తుతం ఆమె మేకప్ ఫీజుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.
ముంబైకి చెందిన ఓజాస్ రజనీ ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. నివేదికల ప్రకారం ఆమె బ్రైడల్, పార్టీ మేకప్ ప్యాకేజీలకు ఒక్కో సెషన్‌కు సుమారు రూ.లక్ష వరకు ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ప్యాకేజీ, అవసరమైన సేవలను బట్టి మారవచ్చు.
ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆమె కేవలం ముఖానికి మేకప్ మాత్రమే చేయరు. హెచ్డీ మేకప్‌తో పాటు హెయిర్ స్టైలింగ్, హెయిర్ ఎక్స్టెన్షన్స్, శారీ డ్రేపింగ్ వంటి సేవలను కూడా అందిస్తారు. ఒక వ్యక్తికి పూర్తి స్థాయి అందమైన లుక్ తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని అంశాలపై దృష్టి పెడతారు.
ఓజాస్ రజనీ నీతా అంబానీతో పాటు శ్లోకా అంబానీ, రాధికా మర్చంట్లకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు, భారీ వేడుకల సందర్భంగా మేకప్, హెయిర్ స్టైలింగ్ చేసినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. అంబానీ కుటుంబంతో ఆమెకు ఉన్న అనుబంధం ఆయనకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది.
కేవలం అంబానీ కుటుంబానికే కాకుండా బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖ నటీమణులకు కూడా ఓజాస్ మేకప్ చేశారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్, దీపికా పదుకొణె, దివంగత నటి శ్రీదేవి వంటి తారలతో కలిసి పనిచేశారు. అంతర్జాతీయ స్థాయిలో మరియా క్యారీ, బ్రిట్నీ స్పియర్స్ వంటి ప్రముఖులకు కూడా సేవలు అందించిన అనుభవం ఆమెకు ఉంది.
ఓజాస్ రజనీ అమెరికాలోని మియామీ స్కూల్ ఆఫ్ హెయిర్ అండ్ మేకప్‌లో శిక్షణ పొందినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలోని బాంద్రాలో సొంత హెయిర్ అండ్ మేకప్ అకాడమీని నిర్వహిస్తున్నారు.
మూడు దశాబ్దాలకు పైగా బ్యూటీ, ఫ్యాషన్ రంగంలో అనుభవం సంపాదించిన ఆమెకు సెలబ్రిటీలతో పనిచేసిన ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణంగా మేకప్ కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసే వారికి ఒక్క సెషన్‌కు రూ.లక్ష అనే మొత్తం ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే సెలబ్రిటీల ప్రత్యేక అవసరాలు, పూర్తి స్థాయి స్టైలింగ్, అనుభవజ్ఞులైన నిపుణుల సేవలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఓజాస్ రజనీ కెరీర్ తెలియజేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..