
సెప్టెంబర్ 15న, సఫర్ హి మంజిల్ హై అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేయబడింది. ఇది ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో, 16,500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక హిమానీనదంలోని పగులులో చిక్కుకున్న హిమాలయన్ బ్రౌన్ బేర్ కూనను రక్షించడం కనిపిస్తుంది. రెస్క్యూ టీ వివరాల ప్రకారం.. కూనను రక్షించడం అంత కష్టమైన పని కాదు. దాని తల్లి నుండి కూన ప్రాణాలను కాపాడటమే అసలైన సవాలు.
ఎత్తైన మంచు పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల ప్రమాదవశాత్తూ 16,500 అడుగుల ఎత్తులో ఉన్న మంచు బిలం లోకి జారిపడిపోయింది. లోతైన మంచు సందులో ఇరుక్కుపోవడంతో బయటకు రా లేక గడ్డకట్టే చలిలో కేకలు వేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రత్యేక రెస్క్యూ టీమ్ సభ్యులు వెంటనే స్పందించి ఆ పిల్లను రక్షించేందుకు సాహసవంతమైన చర్యలు చేపట్టారు.
రెస్క్యూ సభ్యులు లోతైన మంచు సందులోకి దిగి ఆ పిల్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రమైన భయంలో ఉన్న ఆ ఎలుగుబంటి పిల్ల, సహాయం చేయడానికి వచ్చిన వారిని చూసి భయపడి కరిచేందుకు ప్రయత్నించింది. నన్ను కరవకు, నిన్ను కాపాడటానికే వచ్చాం అని ఓదారుస్తూ రెస్క్యూ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా, ఓర్పుగా దానిని సురక్షితంగా పైకి తీసుకువచ్చారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నంత సేపూ, కొద్ది దూరంలో నిలబడి ఉన్న తల్లి ఎలుగుబంటి ఎంతో ఆందోళనతో గమనిస్తూ ఉంది. రెస్క్యూ టీమ్ సభ్యులు పిల్లను సురక్షితంగా బయటకు తీసి నేలపైకి వదిలిన వెంటనే, ఆ పిల్ల పరుగెత్తుకుంటూ తల్లి వద్దకు వెళ్ళింది.
ఆ సమయంలో జరిగిన దృశ్యం అక్కడున్న వారిని, సోషల్ మీడియా వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. తన పిల్లను కాపాడిన రెస్క్యూ బృందం వైపు చూస్తూ ఆ తల్లి ఎలుగుబంటి మనుషుల తరహాలోనే తన తలను వంచి కృతజ్ఞత తెలుపుతున్నట్లుగా నమస్కరించింది.
మనుషులకు, మృగాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని, తల్లి ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. జంతువుల్లోని ఈ కృతజ్ఞతా భావాన్ని చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..