
సోషల్ మీడియాలో ఒక్కోసారి చిన్న చిన్న సంఘటనలు కూడా సంచలనం సృష్టిస్తుంటాయి. ముఖ్యంగా చిన్నారుల ముద్దు ముద్దు చేష్టలు నెటిజన్ల మనసు దోచుకుంటాయి. తాజాగా రెండేళ్ల బాలుడు తన స్టైలిష్ ఫోజులతో ఏకంగా 137 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. అంతేకాదు, ఆ చిన్నారి చదువుకు సంబంధించిన ఖర్చులన్నీ తానే భరిస్తానని ఓ షోరూమ్ యజమాని ముందుకు రావడం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
మహారాష్ట్రలోని యవత్మల్‌కు చెందిన ఓ దంపతులు కొత్త హోండా యాక్టివా స్కూటర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 9వ తేదీన అల్లూరులోని సాయి పాయింట్ హోండా షోరూమ్‌కు వెళ్లారు. తమ రెండేళ్ల కుమారుడు రుద్రాంశ్ సింగ్ ఠాకూర్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. కొత్త స్కూటర్ కొనుగోలు చేసిన అనంతరం తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి స్కూటర్ ముందు ఫొటోలకు పోజులిచ్చారు. అయితే, ఆ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించాడు. పెద్దవాళ్ల మాదిరిగా చక్కని కళ్లద్దాలు పెట్టుకుని, రెండు చేతులను ప్యాంటు జేబుల్లో పెట్టుకుని ఎంతో స్టైలిష్‌గా ఫోజులిచ్చాడు. అతడి హావభావాలు చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు.
తమ కుమారుడి అందమైన ఫోజులను తల్లిదండ్రులు వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే.. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 137 మిలియన్లకు పైగా వ్యూస్, 68 వేలకుపైగా కామెంట్లు వచ్చాయి. రెండేళ్ల చిన్నారి స్టైల్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడి క్యూట్‌నెస్, కాన్ఫిడెన్స్ చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో ద్వారా రుద్రాంశ్‌కు వచ్చిన అపారమైన ప్రజాదరణ చూసి సాయి పాయింట్ హోండా షోరూమ్ యజమాని దిలీప్ బోబాడే పాటిల్ ఆశ్చర్యపోయారు. దీంతో ఆ చిన్నారిని, అతడి కుటుంబ సభ్యులను తన షోరూమ్‌కు ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అంతటితో ఆగకుండా రుద్రాంశ్ భవిష్యత్తుకు ఉపయోగపడేలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అతడి ఎల్‌కేజీ చదువు నుంచి కళాశాల పట్టభద్రత వరకు అయ్యే పూర్తి విద్యా ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఒక చిన్నారి సరదాగా ఇచ్చిన స్టైలిష్ ఫోజులు సోషల్ మీడియాలో ఇంతటి ఆదరణ పొందడమే కాకుండా, అతడి భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప అవకాశాన్ని తీసుకురావడం విశేషం. నెటిజన్లు ఈ షోరూమ్ యజమాని మంచి మనసును అభినందిస్తున్నారు. చిన్నారి రుద్రాంశ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.