
ముంబైలోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్) పైన 1888 నుండి ఒక భారీ గడియారం కొలువై ఉంది. బ్రిటీష్ కాలం నాటి ఈ అద్భుతమైన నిర్మాణ శైలిని గౌరవిస్తూ, ప్రముఖ వాచ్ తయారీ సంస్థ టైటాన్, ఆ గడియారపు డిజైన్‌ను పోలిన ఒక ప్రత్యేకమైన చేతి గడియారాన్ని (Wrist Watch) రూపొందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్‌లో CSMT భవనంపై ఉన్న గడియారం, టైటాన్ రూపొందించిన వాచ్ పక్కపక్కనే కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ ప్రియుల్ని ఈ వాచ్ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఆర్డర్ల కోసం పోటీ పెరుగుతోంది.!
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన మణికట్టుకు ఉన్న టైటాన్ వాచ్‌ను CSMT భవనంపై ఉన్న గడియారానికి ఎదురుగా ఉంచి ఫోటో తీశారు. ఆ రెండింటిని గమనిస్తే, భవనంపై ఉన్న పెద్ద గడియారపు డైల్, రంగులు, అంకెలు అచ్చం టైటాన్ వాచ్‌లో ప్రతిబింబిస్తున్నాయి. 1888లో ప్రతిష్టించిన ఆ గడియారపు వైభవాన్ని ఈ చిన్న వాచ్‌లో చూడటం నెటిజన్లకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తోంది. ఆ రెండింటి మధ్య ఉన్న సారూప్యత, ముఖ్యంగా రోమన్ అంకెలు, క్లాసిక్ ముళ్ళ డిజైన్ నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. భారతదేశ చరిత్రను, వారసత్వాన్ని నేటి తరానికి పరిచయం చేసే ఇలాంటి ప్రయత్నాలను అందరూ అభినందిస్తున్నారు. ఈ పోస్ట్ వేల సంఖ్యలో లైకులు, షేర్లతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది.
CSMT భవనాన్ని ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్ రూపొందించారు. 1888లో ఈ నిర్మాణం పూర్తయినప్పటి నుండి ఆ గడియారం ముంబై నగర వేగాన్ని గమనిస్తూనే ఉంది. టైటాన్ తన హెరిటేజ్ కలెక్షన్‌లోభాగంగా ఇలాంటి చారిత్రక కట్టడాల నుండి స్ఫూర్తి పొంది వాచ్‌లను రూపొందిస్తోంది. గతంలో కూడా కోణార్క్ సూర్య దేవాలయం, తాజ్ మహల్ వంటి కట్టడాల థీమ్స్‌తో వాచ్‌లను విడుదల చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు భారతీయ వారసత్వాన్ని గౌరవించడంలో ఇదొక అద్భుతమైన మార్గం అని కొనియాడుతున్నారు. మరికొందరు ఈ వాచ్ నాకు కావాలి, ఇది కేవలం సమయం మాత్రమే కాదు.. ఒక చరిత్ర అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Mumbai has this iconic clock at the CSMT (earlier Victoria Terminus). This clock is ticking since 1888. Until very recently, commuters used to set their watches by this historic timekeeper of Mumbai.
Titan gave a tribute to this clock by making a wrist watch with that same dial. pic.twitter.com/rRKwwf9UdI
— Siddharth’s Echelon (@SiddharthKG7) March 17, 2026
కళ, చరిత్ర కలగలిస్తే ఫలితం ఎంత అందంగా ఉంటుందో ఈ వాచ్ నిరూపిస్తోంది. పాత కాలపు జ్ఞాపకాలను ఆధునిక హంగులతో అందించడం వల్ల నేటి యువతకు కూడా మన చరిత్ర పట్ల ఆసక్తి పెరుగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…