
రోడ్డుపై బైక్‌పై వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు ఒక్కసారిగా తరిమిన ఘటనలు మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. వీధి కుక్కలు వెంటపడినప్పుడు బైక్‌ను నెమ్మది చేసి, ప్రశాంతంగా ముందుకు సాగడమే సురక్షితమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కుక్కలు వెంటపడగానే చాలామంది భయంతో వెంటనే బైక్ ఎక్సిలేటర్ తిప్పి వేగాన్ని పెంచుతారు. దీనివల్ల బైక్ అదుపుతప్పి కిందపడిపోవడం లేదా ఎదురుగా వచ్చే ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటి పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. పైగా, మీరు వేగం పెంచే కొద్దీ మిమ్మల్ని వేటాడే లక్ష్యంగా భావించి కుక్కలు మరింత వేగంగా మీ వెనుక పరిగెత్తుతాయి.
కుక్కలను భయపెట్టడానికి గట్టిగా కేకలు వేయడం లేదా బైక్ హారన్‌ను నిరంతరం మోగించడం చేయకూడదు. ఎందుకంటే విపరీతమైన శబ్దాలు కుక్కలలో మరింత తీవ్రమైన ఆవేశాన్ని, ఆందోళనను రేకెత్తిస్తాయి. దీనివల్ల అవి మరింత దాడికి దిగే ప్రమాదం ఉందే తప్ప వెనక్కి తగ్గుముఖం పట్టవు.
బైక్ నడుపుతూ కుక్కలను కాళ్లతో తన్నడానికి లేదా బెదిరించడానికి ప్రయత్నించడం అస్సలు మంచిది కాదు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి వాహనంతో సహా కిందపడే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయి. కదిలే బైక్‌పై నుండి కిందపడితే తీవ్ర గాయాలపాలవుతారు.
కుక్కలు వెంటపడుతున్నప్పుడు వాటి కళ్లలోకి నేరుగా చూడకూడదు. జంతు శాస్త్రం ప్రకారం, ఒక జంతువు కళ్లలోకి నేరుగా చూడటాన్ని అవి సవాలుగా లేదా దాడికి సంకేతంగా భావిస్తాయి. అందువల్ల మీ చూపును ముందుకు మాత్రమే ఉంచి ప్రశాంతంగా ఉండాలి.
వీధి కుక్కలు వెంటపడినప్పుడు ఆందోళన చెందకుండా బైక్ వేగాన్ని నెమ్మదిగా తగ్గించాలి. వేగం తగ్గగానే సాధారణంగా కుక్కలు కూడా తమ వేగాన్ని తగ్గించి వెనక్కి తగ్గిపోతాయి. ఒకవేళ అవి బాగా దగ్గరకు వస్తే బైక్‌ను సురక్షితమైన ప్రదేశంలో నిలిపివేసి, ప్రశాంతంగా నిలబడితే అవి మొరిగి వెళ్లిపోతాయి. సంయమనం పాటించడమే మీ ప్రాణ రక్షణకు మార్గం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..