2,000 అండర్‌‌వేర్‌లు భూమిలో పూడ్చిపెట్టిన శాస్త్రవేత్తలు! కొత్త రహస్యాన్ని కనిపెట్టారు..!

నేల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి సాధారణంగా శాస్త్రవేత్తలు రసాయన పరీక్షలు చేస్తారు. కానీ, స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిచ్ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధనా విభాగం శాస్త్రవేత్తలు మాత్రం అత్యంత విచిత్రమైన, వినూత్నమైన ప్రయోగాన్ని చేపట్టారు. నేల సారవంతతను, అందులోని జీవుల పనితీరును పరిశీలించేందుకు ఏకంగా 2,000 తెల్లటి కాటన్ అండర్‌వేర్‌లను భూమిలో పూడ్చిపెట్టారు.

2,000 అండర్‌‌వేర్‌లు భూమిలో పూడ్చిపెట్టిన శాస్త్రవేత్తలు! కొత్త రహస్యాన్ని కనిపెట్టారు..!
Proof By Underpants

Updated on: Oct 04, 2026 | 3:25 PM

నేల ఆరోగ్యాన్ని, అందులోని జీవవైవిధ్యాన్ని పరీక్షించడానికి స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ప్రూఫ్ బై అండర్‌ప్యాంట్స్ అనే వినూత్న ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 1,000 మంది వాలంటీర్ల సహాయంతో దేశవ్యాప్తంగా 2,000 తెల్లటి కాటన్ అండర్‌వేర్‌లు, 12,000 టీ-బ్యాగ్‌లను భూమిలో పూడ్చిపెట్టారు. నేలలో ఉండే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వానపాములు వంటి సూక్ష్మజీవులు ఈ కాటన్ బట్టను ఎంత వేగంగా తిని వేస్తాయో దాని ఆధారంగా నేల సారాన్ని అంచనా వేశారు. 60 రోజుల తర్వాత తీసి చూడగా ఏం జరిగిందంటే..

మనం తొక్కే నేల అడుగున ప్రపంచంలోని సగానికి పైగా జీవవైవిధ్యం దాగి ఉంది. నేల ఎంత ఆరోగ్యంగా ఉంటే, అందులో వానపాములు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి జీవులు అంత ఎక్కువగా క్రియాశీలంగా ఉంటాయి. ఈ జీవులకు కాటన్ ప్రధాన ఆహారం. అందువల్ల నేలలో కాటన్ అండర్‌వేర్ ఎంత వేగంగా చివికిపోతుందో, ఆ నేల అంత సారవంతమైనదని అర్థం. ఈ సూత్రంతోనే ప్రూఫ్ బై అండర్‌ప్యాంట్స్ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్‌లోని దాదాపు 1,000 మంది సాధారణ పౌరుల సహాయం తీసుకున్నారు. వారు తమ తోటలు, వ్యవసాయ భూములు, పార్కులలో గుంతలు తీసి 2,000 కాటన్ అండర్‌వేర్‌లతో పాటు 12,000 టీ-బ్యాగ్‌లను పూడ్చిపెట్టారు.

ఇవి కూడా చదవండి

భూమిలో పూడ్చిన అండర్‌వేర్‌లను 30 రోజులు, 60 రోజుల వ్యవధిలో బయటకు తీసి పరిశీలించారు. ఫలితాలు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచాయి. ప్రైవేట్ తోటలు, కూరగాయల పాదులు ఉన్న నేలలో పూడ్చిన అండర్‌వేర్‌లు అత్యంత వేగంగా చివికిపోయి ముక్కలయ్యాయి. అంటే ఈ నేలల్లో సూక్ష్మజీవుల సంఖ్య, పోషకాలు ఎక్కువగా ఉండి అత్యంత సారవంతంగా ఉన్నాయని తేలింది. పార్కులు, గడ్డి మైదానాల నేలలో పాతిన అండర్‌వేర్‌లు తక్కువగా చివికాయి. అక్కడ నేల తక్కువ జీవక్రియతో నిర్జీవంగా ఉన్నట్లు గుర్తించారు. పంట పొలాలు ఈ రెండింటి మధ్యస్థాయిలో ఫలితాలను ఇచ్చాయి.

మనం భూమిని ఉపయోగించే విధానం నేలలోని ప్రాణకోటిపై నేరుగా ప్రభావం చూపుతుందని పరిశోధన బృందం నాయకుడు మార్సెల్ వాన్ డెర్ హెయిడెన్ తెలిపారు. సాధారణ ప్రజలకు నేల ఆరోగ్యం, ప్రాముఖ్యతను సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకు ఈ అండర్‌వేర్ ఇండెక్స్ అద్భుతంగా తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నేలను కాపాడుకోవడానికి, దాని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఇలాంటి నిరంతర పరిశీలనలు అవసరమని ఈ ప్రయోగం నిరూపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us