
ఒక ఐటీ ఉద్యోగి జీవితంలో ఒక్క లేఆఫ్ ఎలా కొలుకోలేని దెబ్బతీసిందో చూపించే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు కష్టపడి చెల్లించిన ఈఎంఐలు ఒక్కసారిగా ఆగిపోవడంతో రూ.1.2 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కోల్పోయినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గృహ రుణాలు, బ్యాంకుల విధానాలపై నెట్టింట తీవ్ర చర్చ మొదలైంది. బాధితుడి వివరాల ప్రకారం, ఆయన సుమారు ఎనిమిదేళ్ల క్రితం హోమ్‌లోన్‌తో ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రతి నెలా సమయానికి ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే ఇటీవల కంపెనీలో జరిగిన లేఆఫ్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. కొత్త ఉద్యోగం దొరకకపోవడంతో వరుసగా మూడు ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. ఇదే అతని జీవితంలో అతి పెద్ద మలుపుగా మారిందని చెప్పాడు.
బెంగళూరుకు చెందిన CA మీనల్ గోయల్ లింక్డ్ఇన్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. తన పొరుగున ఉంటున్న రాజేష్‌ను అక్టోబర్ 2025లో ఉద్యోగం నుండి తొలగించారని ఆమె వివరించారు. దీంతో అతను జనవరి 2026 వరకు వరుసగా మూడు EMIలు చెల్లించ లేకపోయాడు. దీంతో బ్యాంక్ SARFAESI చట్టం కింద అతనిపై నోటీసు జారీ చేసింది. 60 రోజుల్లోనే ఫ్లాట్ వేలం వేయబడింది. రాజేష్ రూ.1.2 కోట్లకు ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. కానీ, అది వేలంలో కేవలం రూ.95 లక్షలకు అమ్ముడైంది. ఎనిమిది సంవత్సరాలు EMIలు చెల్లించిన తర్వాత, అతనికి రూ.15 లక్షలు మాత్రమే తిరిగి వచ్చింది. అయితే బ్యాంకు బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి పొందడానికి దాదాపు రూ.80 లక్షలు తన వద్ద ఉంచుకుంది.
ఈ సంఘటన ద్వారా హోం లోన్ పూర్తిగా చెల్లించే వరకు ఇల్లు పూర్తిగా మీది కాదని తనకు అర్థమైందని మీనల్ గోయల్ రాశారు. గృహ రుణం తీసుకునే ముందు అత్యవసర నిధిని కలిగి ఉండాలని ఆమె ప్రజలకు సలహా ఇచ్చింది. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా తలెత్తితే, బ్యాంకుతో మాట్లాడుకుని మీ లోన్ రెనివల్ చేయించుకునే ప్రయత్నం చేయండి.
ఈ పోస్ట్ రెండు వారాల క్రితం షేర్ చేయబడింది. కానీ, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ షేర్ చేయడంతో చాలా మంది స్పందించారు. 8 ఏళ్ల బెంగళూరు ఫ్లాట్ దాని అసలు ధర కంటే తక్కువకు అమ్ముడుపోయే అవకాశం లేదని కొంతమంది వినియోగదారులు అన్నారు. 90 రోజుల డిఫాల్ట్ తర్వాత కూడా బ్యాంకులు సాధారణంగా 3 నెలల పొడిగింపును మంజూరు చేస్తాయని ఒక వినియోగదారు రాశారు. 60 రోజుల్లోపు వేలం అసంభవమని, సమాచారం తప్పు కావచ్చునని కూడా మరొకరు అన్నారు.
A Bengaluru resident lost his ₹1.20 crore flat after missing just three home loan EMIs due to job loss. The SARFAESI Act auctioned the flat for a mere ₹95 lakh.
CA Meenal Goel explained that her neighbour had been diligently paying EMIs for eight years. However, after default,…
— Amit Arora 🇮🇳 (@GuruShareMarket) March 2, 2026
ఈ కథ పూర్తిగా నిజమో కాదో తెలియదు. కానీ, ఇది ఖచ్చితంగా మనందరికీ ఒక ముఖ్యమైన గుణపాఠాన్ని అందిస్తుంది. గృహ రుణం తీసుకునేటప్పుడు దృఢమైన ఆర్థిక భద్రతా ప్రణాళికను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అత్యవసర నిధులు, బీమా, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఇలాంటి సమయాల్లో మనల్ని ఆదుకుంటాయి. ఉద్యోగం కోల్పోవడం వంటి పరిస్థితులలో మీ బ్యాంకుతో కమ్యూనికేషన్‌ను నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ఉద్యోగ భద్రత లేకపోవడం, పెరుగుతున్న జీవన వ్యయాలు మధ్య తరగతి కుటుంబాలకు ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తాయో ఈ ఘటన స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..