
భారతదేశంలోనే తొలిసారిగా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అరుదైన లాజవర్త్ నీలిరంగు రాయి నుంచి భారీ శివలింగాన్ని తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జాతీయ అవార్డు గ్రహీత శిల్పి దీపక్ విశ్వకర్మ ఆధ్వర్యంలో సింగిల్ రాతితో ఈ అద్భుతాన్ని మలుస్తున్నారు. పంజాబ్‌లోని నవాంశహర్‌లో నిర్మిస్తున్న వంశవృద్ధి మహాదేవ్ ఆలయం కోసం భారత్, సూడాన్, వియత్నాం సహా 5 దేశాల అరుదైన రాళ్లతో మొత్తం 70 విగ్రహాలను రూపొందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఈ శివలింగ తయారీకి ఆఫ్ఘనిస్థాన్ నుండి సుమారు రూ. 15 లక్షల విలువైన 5×5 అడుగుల సింగిల్ పీస్ లాజవర్త్ రాతిని తెప్పించారు. ముదురు నీలిరంగు, బంగారు కాంతులతో మెరిసిపోయే ఈ రాయికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆధ్యాత్మిక, కళాత్మక ప్రాధాన్యత ఉంది. శివలింగాన్ని చెక్కిన తర్వాత ఇది దాదాపు 3 అడుగుల ఎత్తు, 1.5 టన్నుల బరువు ఉంటుంది. ఈ శివలింగ రూపకల్పన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ఉన్న శాండ్‌స్టోన్ శివలింగ శిల్పకళ నుంచి ప్రేరణ పొందింది.
ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక శివలింగానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆలయం కోసం మొత్తం 70 విగ్రహాలను రూపొందిస్తుండగా, అందులో 60 విగ్రహాలను గ్వాలియర్‌లోనే చెక్కుతున్నారు. దీనికోసం భారత్, ఆఫ్ఘనిస్థాన్, బ్రెజిల్, సూడాన్, వియత్నాం వంటి ఐదు విభిన్న దేశాల నుండి ప్రత్యేక రాళ్లను తెప్పించారు.
వినాయకుడు: సూడాన్ నుండి వచ్చే పచ్చని మర్గజ్ రాతితో చెక్కుతున్నారు.
కార్తికేయుడు: వియత్నాంకు చెందిన బ్లాక్ మార్బుల్‌ను ఉపయోగిస్తున్నారు.
నంది: రాజస్థాన్‌లోని జైసల్మేర్ గోల్డెన్ స్టోన్‌తో రూపుదిద్దుకోనుంది.
పార్వతీ దేవి: మకరానా తెల్లటి అరుదైన మార్బుల్‌తో చెక్కుతున్నారు.
ఈ అరుదైన శివలింగం, ఇతర విగ్రహాలను పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న వంశవృద్ధి మహాదేవ్ ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధిని ప్రసాదించే దివ్యక్షేత్రంగా ఈ ఆలయానికి ఆధ్యాత్మిక నమ్మకం ఉంది. మార్చి 2027 నాటికి ఈ విగ్రహాల తయారీ పూర్తయి, ఆలయంలో వైభవంగా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అంతర్జాతీయ శిల్పకళ, ఆధ్యాత్మిక విశ్వాసాల సమ్మేళనంగా నిలిచే ఈ నీలి శివలింగం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..