
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏ విచిత్రమైన సంఘటన వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. తాజాగా కేరళలోని కొట్టాయం జిల్లా నుంచి వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. వాహనం నడుపుతూ తీవ్రంగా అలసిపోయిన ఒక యువకుడు, కారును రోడ్డు పక్కకు పక్కకు కాకుండా ఏకంగా బిజీగా ఉండే రోడ్డు మధ్యలోనే నిలిపేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. అసలేం జరిగింది?
కేరళలోని ఎట్టుమానూర్-అతిరంపుళ రహదారిపై ఉన్న పల్లి జంక్షన్ సమీపంలో ఈ విచిత్ర ఘట్టం చోటుచేసుకుంది. ఒక యువకుడు ఎరుపు రంగు కారులో ప్రయాణిస్తూ, డ్రైవింగ్ చేస్తూ అలసిపోయాడు. విశ్రాంతి తీసుకోవాలని భావించిన అతడు కారును రోడ్డు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లకుండా, నడిరోడ్డుపైనే నిలిపివేశాడు. కారు లోపల గట్టిగా మ్యూజిక్ పెట్టుకుని సీటులోనే గాఢనిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో ఆ బిజీ రోడ్డులో వెనుక వైపు కేఎస్‌ఆర్‌టీసీ ప్రభుత్వ బస్సుతో పాటు అనేక వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో అసలు ఏం జరిగిందో అని చూడటానికి తోటి వాహనదారులు, స్థానికులు కారు వద్దకు వచ్చారు.
స్థానికులు కారు అద్దాలు తడుతూ, ఎంతగా అరిచి పిలిచినా సదరు డ్రైవర్ కనీసం స్పందించలేదు. మ్యూజిక్ హోరులో అతడు గాఢ నిద్రలో మునిగిపోయాడు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో, ఆఖరికి స్థానికులు, వాహనదారులు కలిసి కారును గట్టిగా కుదిపారు. దాంతో అకస్మాత్తుగా మేల్కొన్న ఆ యువకుడు చుట్టూ ఉన్న జనాన్ని, ట్రాఫిక్‌ను చూసి తీవ్ర అయోమయానికి గురయ్యాడు.
Wow, what a sleep! 😴😂
Yesterday (19/08/2026) evening, a man reportedly parked his vehicle in the middle of the road near the church ground on the Ettumanoor–Athirampuzha road and went to sleep.
Seeing the car blocking the busy road, locals initially thought the driver might… pic.twitter.com/zvbRrK7KtP
— InTheLoop (@jinx_5182) August 20, 2026
ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడంతో వీడియో క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై విభిన్నంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కనీసం ప్రమాదం చేయకుండా కారు ఆపి నిద్రపోయినందుకు సంతోషం అని కొందరు చమత్కరిస్తే, ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలి అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు ప్రమాదకరంగా వాహనాన్ని నిలిపివేసి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించినందుకు సదరు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.