
ప్రకృతి ఇచ్చిన వరం కొందరిలో చిన్నతనంలోనే అద్భుత ప్రతిభ రూపంలో బయటపడుతుంది. బ్రిటన్‌కు చెందిన 12 ఏళ్ల సామ్యూల్ హెండర్సన్ అనే బాలుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను, పక్షి ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. సాధారణంగా మనుషులు ఇతర వ్యక్తుల గొంతులను అనుకరించడం చూస్తుంటాం. కానీ, ఈ బుడతడు ఏకంగా 130 కి పైగా వివిధ రకాల పక్షుల కూతలను అచ్చం ఉన్నది ఉన్నట్లుగా అనుకరిస్తాడు.
సామ్ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక ఆసక్తికరమైన సంఘటన నిదర్శనంగా నిలిచింది. పక్షుల కూతల ఆధారంగా అవి ఏ జాతికి చెందినవో గుర్తించడానికి మెర్లిన్ అనే కృత్రిమ మేధ (AI) ఆధారిత యాప్‌ను ఉపయోగిస్తుంటారు. సామ్యూల్ ఈ యాప్ ముందు నిలబడి రకరకాల పక్షుల శబ్దాలను అనుకరించి కూయడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా, ఆ ఏఐ యాప్ అది మనిషి చేస్తున్న శబ్దం అని గుర్తుపట్టలేకపోయింది! సామ్యూల్ గొంతును నిజమైన పక్షి స్వరం అని భావించి, ఆ పక్షుల పేర్లను పర్ఫెక్ట్‌గా స్క్రీన్‌పై చూపించింది. సాంకేతికతను సైతం తమ గొంతుతో మాయ చేయగలగడం అందరినీ విస్తుపోయేలా చేసింది.
సామ్‌కు చిన్ననాటి నుంచే ప్రకృతి, చెట్లు, పక్షుల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. తోటల్లో, అడవుల్లో విహరించే సమయంలో పక్షుల శబ్దాలను తీవ్రంగా గమనించేవాడు. వాటి శ్వాస తీరు, గొంతులోని శబ్ద వైవిధ్యాలను పరిశీలిస్తూ గొంతును సరిచేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. అలా రోజువారీ సాధనతో 130కి పైగా పక్షుల స్వరాన్ని హుందాగా అనుకరించే స్థాయికి ఎదిగాడు. కాకులు, పిచ్చుకల నుంచి మొదలుకొని అరుదైన అడవి పక్షుల శబ్దాల వరకు సామ్ నోటి నుంచి చాలా సహజంగా వస్తాయి.
సామ్ పక్షుల స్వరాన్ని అనుకరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. పక్షి ప్రేమికులు, సైంటిస్టులు ఈ చిన్నారి ప్రతిభను ప్రశంసిస్తున్నారు. చిన్న వయసులోనే ప్రకృతితో అంతగా మమేకమై పక్షుల భాషను పట్టేసిన సామ్, భవిష్యత్తులో ఆర్నిథాలజీ రంగంలో గొప్ప ఎత్తులకు ఎదుగుతాడని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..