
Chinna Jeeyar Swamy Yatindra Saptati: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం సమతామూర్తి ప్రాంగణంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ‘యతీంద్ర సప్తతి’ నాలుగో రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ రక్షణ, సమాజ సేవలో నిస్వార్థంగా కృషి చేసిన 70 మంది త్యాగధనులకు, సేవానిరతి కలిగిన 70 మంది మాతృమూర్తులకు ‘సమతా పురస్కారాలు’ అందజేసి ఘనంగా సత్కరించారు. సాయంత్రం శ్రీకోదండరామునికి 33వ ఏకోత్తర సహస్ర కలశాభిషేకానికి అంకురారోపణ జరిగింది.
ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ.. దేశంలో కులాలు, మతాలు వేరైనా మనమందరం ఒకే భగవంతుని బిడ్డలమని, ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించిన గొప్ప సమతావాది రామానుజాచార్యులని కొనియాడారు. సైనికులు దేశ శరీరాన్ని కాపాడితే, జ్ఞానవంతులు దేశ ఆత్మను బలోపేతం చేస్తారని పేర్కొంటూ సేవామూర్తులకు మంగళాశాసనాలు అందించారు.
కార్యక్రమంలో పాల్గొన్న మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ.. ఎందరో పాలకులు మారినా భారతీయ సంస్కృతి, ధర్మం సజీవంగా ఉన్నాయంటే దానికి సాధువులు, ఆచార్యుల పాత్రే కారణమని అన్నారు. రామానుజుల అడుగుజాడల్లో చిన్న జీయర్ స్వామి ప్రపంచానికి గొప్ప జీవన మార్గాన్ని చూపిస్తున్నారన్నారు. స్వల్ప గాయం ఉన్నప్పటికీ హాజరైన రామేశ్వరరావు రాక తమకు ఎంతో స్ఫూర్తిదాయకమని స్వామీజీ పేర్కొన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో నంబర్ వన్ సంస్థగా ఉన్న టీవీ9, పారిశ్రామిక, నిర్మాణ రంగాలలో మై హోమ్ గ్రూప్ సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రశంసించారు. యతీంద్ర సప్తతి వేడుకల్లో భాగంగా ఈ సాయంత్రం శ్రీకోదండ రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 33వ ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
శ్రీరామనగరం: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నిర్వహించిన యతీంద్ర సప్తతి ఉత్సవాలకు బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి విచ్చేయడం పట్ల చిన్న జీయర్ స్వామి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న 70 మంది మాతృమూర్తులను సత్కరించడం ఎంతో విశిష్టమైన కార్యక్రమమని చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో మాతృమూర్తులకు అత్యున్నత స్థానం ఉందని, సమాజం కోసం సేవ చేస్తున్న మహిళలను గౌరవించడం మన బాధ్యతని చెప్పారు. మహిళల సేవలను గుర్తించి సత్కరించడం ద్వారా మరింత మందికి సేవా స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి మాతృమూర్తుల సేవలను అభినందించిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి చిన్న జీయర్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీరామనగరం: సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న 70 మంది మాతృమూర్తులను సత్కరించడం ఎంతో విశిష్టమైన కార్యక్రమమని మహిళా పురస్కార గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నిర్వహించిన యతీంద్ర సప్తతి ఉత్సవాల్లో భాగంగా తమను గుర్తించి గౌరవించడం గర్వంగా ఉందన్నారు. చిన్న జీయర్ స్వామి సమానత్వాన్ని కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా, చేతల్లో చూపించారని కొనియాడారు. సమాజ సేవలో మహిళల పాత్రను గుర్తించి, వారికి సముచిత గౌరవం కల్పించడం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సత్కారం తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులోనూ సమాజ సేవను కొనసాగిస్తామని పురస్కార గ్రహీతలు తెలిపారు.
వీడియో చూడండి..