
ఆన్‌లైన్ మోసాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ పేరిట వచ్చిన ఫేక్ మెసేజ్‌ను నమ్మి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. కష్టపడి తనను చదివిస్తున్న తండ్రికి ఆసరాగా నిలవాలనుకున్న ఆ యువకుడు.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి లక్ష్యాన్ని అర్ధాంతరంగా ముగించాడు.సైబర్ మాయగాళ్ల మోసాలకు అమాయక విద్యార్థులు బలవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు రోషన్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితమే తల్లి చనిపోవడంతో తండ్రి వెంకటేష్ కూలీ పనులు చేస్తూ కొడుకులను ఎంతో కష్టపడి చదివించాడు. తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి, చదువుకుంటూనే కొంత ఆర్థికంగా తోడ్పడాలని రోషన్ భావించాడు. ఈ క్రమంలోనే అతని మొబైల్‌కు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చనే ఓ ఫేక్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌ను నిజమని నమ్మిన రోషన్.. సైబర్ కేటుగాళ్లు చెప్పినట్లు విడతల వారీగా దాదాపు 30 వేల రూపాయల వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అవతలి వ్యక్తుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయానని గ్రహించాడు రోషన్. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్నాననే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతాడనుకున్న కొడుకు శవమై పడి ఉండటంతో తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఈ ఘటనతో గూడెం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.