
నల్లగొండకు చెందిన సతీష్, చండూరు మండలం పుల్లెంలకు మహబూబ్ బీ (43) ఇద్దరూ పోలీస్ శాఖలోనే హోంగార్డులుగా పని చేసేవారు. ఆ పరిచయం వీరి మధ్య కాస్తా ప్రేమగా మారింది. మతాలు వేరైనా, పెద్దలను ఎదిరించి 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అంతా సజావుగానే సాగుతుందనుకున్న తరుణంలో ఆ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ఏడేళ్ల క్రితం సతీష్ హోంగార్డు ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడు. దీంతో కుటుంబ భారం మొత్తం మహబూబ్ బీ పైనే పడింది. ఆమె నల్లగొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తూ, రూరల్ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. వస్తున్న కొద్దిపాటి జీతంతోనే ముగ్గురు పిల్లలను సాకుతూ ఇల్లు గడుపుతోంది మహబూబ్ బీ. ఉద్యోగం పోవడంతో మానసిక వేదనతో సతీష్ మద్యానికి బానిస అయ్యాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
రోజు మాదిరిగానే ఈరోజు కూడా ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. ఈ క్రమంలో మళ్లీ ఇద్దరి మధ్య పాత గొడవలు ముదిరాయి. మాట మాట పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన సతీష్.. మహబూబ్ బీపై దాడి చేశాడు. ఆమె గొంతు నులిమి, తలను గట్టిగా నేలకేసి కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో మహబూబ్ బీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
స్థానికుల సమాచారంతో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడి ఉన్న మహబూబ్ బీ మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సతీష్‌ను తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. అసలు హత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఏంటి? కేవలం కుటుంబ కలహాలేనా లేక మరేదైనా కోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కొంతకాలంగా కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయని, భార్యపై అనుమానంతో భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.
తల్లి ఇక తిరిగిరాదన్న నిజాన్ని ఆ ముగ్గురు చిన్నారులు ఎలా జీర్ణించుకుంటారన్నదే ఇప్పుడు అందరినీ కలిసివేస్తోంది. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య కుటుంబ జీవితం ఇలా విషాదంగా ముగియడం. ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని మహబూబ్ బీ బంధువులు వాపోతున్నారు.