
అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.. చివరకు ప్రాణాలు తీసే దారుణాలకు దారితీస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన తాజా ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ భార్య.. తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసి.. అనంతరం జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి.. మనూరు మండలానికి చెందిన కల్పనతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. బయటకు సాఫీగా కనిపించిన ఈ కుటుంబ జీవితం.. మూడు నెలల క్రితం కొత్త మలుపు తిరిగింది.
నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కల్పనకు.. మనూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన బేగరి పండరి అలియాస్ చింటూతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. దీంతో తమ సంబంధానికి భర్త ముత్యం రెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించిన కల్పన, చింటూ కలిసి అతడిని హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.
పథకం ప్రకారమే ముత్యం రెడ్డిని హత్య చేసిన నిందితులు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలంలో జేసీబీతో పెద్ద గొయ్యి తీయించారు. అనంతరం మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టి.. పైభాగంలో రాళ్లు వేసి ఆనవాళ్లు కనిపించకుండా చేశారు.
హత్య అనంతరం భర్త కనిపించడం లేదంటూ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసి.. మిస్సింగ్ డ్రామా ఆడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఘటన జరిగి తొమ్మిది రోజులు గడిచినా కేసులో పురోగతి లేకపోవడంతో.. కల్పన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో చివరకు అసలు విషయం బయటపడింది. తామే ముత్యం రెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టినట్లు కల్పన, చింటూ ఒప్పుకున్నట్లు సమాచారం. అనంతరం పోలీసులు నిందితులు చెప్పిన ప్రదేశానికి వెళ్లి.. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. తహశీల్దార్ సమక్షంలో అక్కడే పంచనామా నిర్వహించి.. పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..