
బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): “కరిస్తే కప్పకు కోపం.. విడిస్తే పాముకు కోపం” అనే పాత సామెత అందరికీ తెలిసిందే. సాధారణంగా ప్రకృతిలో పాములు కప్పలను ఆహారంగా తీసుకోవడం మనం చూస్తుంటాం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఇందుకు పూర్తి విరుద్ధమైన, ఒకింత విస్మయానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఒక పెద్ద కప్ప, తాచుపామునే మింగేస్తూ స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
బూర్గంపాడుకు చెందిన గుండె సారయ్య ఇంటి ఆవరణలో అకస్మాత్తుగా ఏవో భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఏమైందోనని ఇంటి ఆవరణలోని నీరు పోయే డ్రైనేజీ ఛాంబర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ ఒక పెద్ద కప్ప, తాచుపామును అమాంతం మింగుతూ కనిపించడంతో సారయ్య కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తొలుత భయాందోళనకు లోనైనప్పటికీ, కప్ప పామును మింగేస్తున్న అరుదైన దృశ్యాన్ని చూసి విస్తుపోయారు.
ఈ వింత విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో, ఆ దృశ్యాలను కళ్లారా చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు, స్థానికులు పెద్ద ఎత్తున సారయ్య ఇంటికి తరలివచ్చారు.
స్థానికులు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో బంధించడంతో, ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వినడానికి వింతగా అనిపించినా, కళ్లముందే జరిగిన ఈ ప్రకృతి వింత స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.