
ఒకప్పుడు ఎలాంటి మెరుగైన వైద్యం కావాలన్నా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చేది. ఆయువు తీరితే మార్గమధ్యలోనే తనువు చాలించాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు. హైదరాబాద్ తరహా మెరుగైన వైద్య సేవలు ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగిన 24 అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేసింది. ఈ దసరా పండుగ కానుకగా తెలంగాణ ప్రజలకు ఈ ఆసుపత్రిని అంకితం చేయబోతోంది.
వరంగల్ – హనుమకొండ జంట నగరాల మధ్య గతంలో సెంట్రల్ జైలు ఉన్న స్థలంలో అత్యాధునిక హంగులతో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. మొత్తం 56 ఎకరాల 39 గుంటల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. 2021 జూన్ 21వ తేదీన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంతో ప్రస్తుతం ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆసుపత్రి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లను పరిశీలించారు.
పేద రోగులకు దసరా కానుక:
దసరా రోజున పరిమితంగా ఓపీ (OP) సేవలు ప్రారంభించి, పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందిస్తామని మంత్రులు తెలిపారు. ఈ పెద్దాసుపత్రి అందుబాటులోకి వస్తే వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు కాలం చెల్లినట్లేనని పేర్కొన్నారు. వరంగల్లో నిర్మించిన ఈ భారీ ఆసుపత్రి సర్కారు వైద్యానికి సరికొత్త చిరునామాగా మారబోతోంది. 2,200 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 42 లిఫ్టులు, అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 14వ అంతస్తు వరకు వైద్య సేవలకు ఉపయోగించనున్నారు. 23, 24 అంతస్తులను కాన్ఫరెన్స్ హాళ్ల కోసం కేటాయించనున్నారు. ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 14వ అంతస్తు వరకు ఏయే విభాగాలను కేటాయించాలనే దానిపై ప్రాథమిక ప్రణాళికలు రూపొందించారు. ఆసుపత్రి ప్రాంగణంలో విశాలమైన పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, సోలార్ పవర్ సహా ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రారంభంలో భాగంగా తొలి మూడు అంతస్తుల్లో వైద్య సేవలు మొదలుకానున్నాయి. దశలవారీగా వైద్య పరికరాలు, అత్యాధునిక సేవలు సమకూరిన తర్వాత పూర్తి స్థాయిలో భవనాన్ని వినియోగంలోకి తీసుకువస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో సూపరింటెండెంట్ ఛాంబర్తో పాటు ఎమర్జెన్సీ వార్డు (క్యాజువాలిటీ), మెడికల్ ఐసీయూ, ఆర్ఐసీయూ, ట్రామా ఐసీయూ సేవలు ఉంటాయి.
1 నుంచి 14వ అంతస్తు వరకు 34 విభాగాలకు చెందిన అత్యాధునిక వైద్య విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక యంత్ర పరికరాలు కొలువుదీరనున్నాయి. 14వ అంతస్తులో సెమీ-వీఐపీ, వీఐపీ ప్రైవేటు గదులతో పాటు బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన అంతస్తులను ఆయా విభాగాల ఫ్యాకల్టీకి కేటాయిస్తారు. నిమ్స్ (NIMS) తరహాలోనే ఇక్కడ కూడా డైరెక్టర్తో పాటు ప్రత్యేక పాలక కమిటీని నియమించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.