Telangana: దసరాకు కాదు.. దీపావళికే బతుకమ్మ పండుగ.. ఆడ, మగ కలిసి ఆడటం వెనుక 200 ఏళ్ల మిస్టరీ..

తెలంగాణ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఆశ్వయుజ మాసంలో ఆడపడుచులు ఆడుకునే పూల పండుగ బతుకమ్మ. కానీ రాష్ట్రమంతా బతుకమ్మ సంబరాలు ముగిసిపోయి.. దీపావళి వేళ టపాసుల మోతలతో సందడి చేస్తుంటే, ఆ ఒక్క ఊరిలో మాత్రం మళ్లీ బతుకమ్మ పాటలు మార్మోగుతాయి. అంతటితో అయిపోలేదు.. ఆడవారితో పాటు మగవాళ్లు కూడా పోటీపడి బతుకమ్మ ఆడటం ఇక్కడి అసలైన వింత. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారం వెనుక అసలు కథేంటో తెలుసుకుందాం..

Telangana: దసరాకు కాదు.. దీపావళికే బతుకమ్మ పండుగ.. ఆడ, మగ కలిసి ఆడటం వెనుక 200 ఏళ్ల మిస్టరీ..
Unique Diwali Bathukamma

Edited By:

Updated on: Nov 10, 2026 | 6:31 PM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. సాధారణంగా ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు మాత్రమే రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, సంబరంగా ఆడుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చూస్తుంటాం. అయితే తెలంగాణలోని ఆ ఒక్క గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. రాష్ట్రమంతా బతుకమ్మ పండుగ ముగిసిపోయి, దీపావళి వేళ బాణాసంచా మోతలతో సందడి చేస్తుంటే.. ఈ ఊరిలో మాత్రం బతుకమ్మ పాటలు మార్మోగుతాయి. అంతేకాదు, మహిళలతో పాటు పురుషులు కూడా సమానంగా బతుకమ్మ ఆడటం ఇక్కడి మరో విశేషం.

ఆ ఊరి ప్రత్యేకత ఏంటి?

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో ఈ వింత ఆచారం శతాబ్దాలుగా అమలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు జరిగితే, సీతంపేటలో మాత్రం మహిళలు ఆ సమయానికి దూరంగా ఉంటారు. దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగి తేలే సమయంలో ఈ గ్రామంలో మూడు రోజుల పాటు ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. పురుషులు కేవలం బతుకమ్మను మోయడానికో, చూడటానికో మాత్రమే పరిమితం కాకుండా.. మహిళలతో కలిసి స్వయంగా బతుకమ్మ ఆడటం ఈ ఊరి సంప్రదాయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం.

200 ఏళ్ల నాటి సంప్రదాయం

ఈ వింత ఆచారం సీతంపేటలో దాదాపు 200 ఏళ్లకు పైగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. గ్రామంలోని నేతకాని కులస్తులు ఏటా దీపావళి సందర్భంగా ఈ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి రోజూ ఓ ప్రత్యేక విశిష్టత ఉంటుంది.

మొదటి రోజు: శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

రెండో రోజు: మట్టితో చేసిన ప్రత్యేకమైన ఎద్దుల ప్రమిదలను సిద్ధం చేస్తారు. వీటికి నైవేద్యంగా పిండివంటలు సమర్పించి, డప్పు చప్పుళ్లతో ఊరంతా ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు. పూజల అనంతరం ఆ ప్రతిమలను నిమజ్జనం చేస్తారు.

మూడో రోజు: తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి వేడుకలు జరుపుకుంటారు. మహిళలతో పాటు పురుషులు కూడా పెద్ద ఎత్తున చేరి, పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు.

ప్రజాప్రతినిధుల హాజరు.. అధికార యంత్రాంగం ఏర్పాట్లు

ఈ ఏడాది కూడా సీతంపేటలో దీపావళి బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రత్యేక ఆచారాలతో సాగిన ఈ సంబరాలలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలకు తరలివచ్చిన భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమాజంలో లింగ వివక్ష లేకుండా స్త్రీ, పురుషులు కలిసి వేడుకల్లో పాలుపంచుకోవడం, భిన్నమైన సమయంలో సంప్రదాయాన్ని కాపాడుకోవడం సీతంపేట గ్రామ బతుకమ్మ ఉత్సవాల విశిష్టతను చాటిచెబుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us