Telangana: నాన్నే దైవం.. ఆ ప్రేమ గుండె ‘గుడి’లో పదిలం

| Edited By: Narender Vaitla

Jun 30, 2023 | 7:31 PM

నాన్న అంటేనే ఓ ఎమోషన్. కష్టం ఎప్పుడు వచ్చినా గుర్తొచ్చే పేరు నాన్నే. తాను ఎలా బతికినా.. పిల్లలు గొప్పగా బతకాలని ఆశించే వ్యక్తే నాన్న. ఇలా చెప్పుకుంటూ తండ్రి గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. తండ్రిపై ప్రేమను చాటుకోవడానికి ఎన్నో మార్గాలుంటాయి. అయితే సూర్యాపేటకు చెందిన ఇద్దరు కుమారులు తండ్రిపై ఉన్న ప్రేమను...

Telangana: నాన్నే దైవం.. ఆ ప్రేమ గుండె గుడిలో పదిలం
Suryapet
Follow us on

నాన్న అంటేనే ఓ ఎమోషన్. కష్టం ఎప్పుడు వచ్చినా గుర్తొచ్చే పేరు నాన్నే. తాను ఎలా బతికినా.. పిల్లలు గొప్పగా బతకాలని ఆశించే వ్యక్తే నాన్న. ఇలా చెప్పుకుంటూ తండ్రి గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. తండ్రిపై ప్రేమను చాటుకోవడానికి ఎన్నో మార్గాలుంటాయి. అయితే సూర్యాపేటకు చెందిన ఇద్దరు కుమారులు తండ్రిపై ఉన్న ప్రేమను వినూత్న మార్గంలో చాటారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం కిష్టు తండాలో తండ్రికి గుడికట్టి తమకున్న ఘనమైన ప్రేమను తనయులు చాటుకున్నారు.

కిష్టు నాయక్ తండాకు చెందిన గుగులోత్ కిష్టు నాయక్ సోమ్ల తండా ఎంపీటీసీగా పనిచేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఇతనికి ముగ్గురు కొడుకులు. ఉన్నంతలో కష్టపడి ముగ్గురు కొడుకులను కిష్టు నాయక్ చదివించి ప్రయోజకులను చేశాడు. కిష్టు నాయక్ గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందాడు. ముగ్గురు కొడుకుల్లో పెద్దకొడుకు వ్యవసాయం చేస్తుండగా గుగులోత్ ప్రసాద్, రతన్ సింగ్‌లు ఉద్యోగులుగా ఉన్నారు. ప్రసాద్ ప్రస్తుతం నల్లగొండ జిల్లా నకిరేకల్ తహసీల్దార్ గా పని చేస్తుండగా, రతన్ సింగ్ ఆర్మీలో 18 ఏళ్లు జవాన్‌గా పనిచేసి పదవి విరమణ చేసి ప్రస్తుతం ఎస్‌బీఐ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు.

తమ సంపూర్ణ అభివృద్ధికి పాటుపడి తమని ప్రయోజకులుగా చేసినందుకు మమకారంతో గ్రామ నడిబొడ్డున తమ సొంత భూమిలో 5 లక్షలు వెచ్చించి గుడి కట్టారు. తల్లి రంగమ్మ చేతుల మీదుగా తండ్రికి కట్టిన గుడిని ప్రారంభించుకున్నారు, అందులో తండ్రి విగ్రహం ప్రతిష్టించి తండా వాసుల నడుమ ఘనంగా నివాళులు అర్పించి వేడుక చేశారు. కుమారులను ప్రయోజకులుగా చేయడంతో పాటు గ్రామాభివృద్ధికి తోడ్పడ్డ కిష్టు నాయక్ కి గుడి కట్టించడాన్ని గ్రామస్థులు హర్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..