
హైదరాబాద్: లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో అరెస్టై 67 రోజులుగా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఉప్పరపల్లి కోర్టు మంగళవారం (అక్టోబర్ 06) ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని షరతు విధించారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆమెను బెదిరించారని వచ్చిన ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూలై 29న నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
కోర్టు ఆదేశాల మేరకు అప్పటి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తాజాగా బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో 67 రోజుల జైలు జీవితం అనంతరం ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో తదుపరి దర్యాప్తు, కోర్టు విచారణ ఎలా కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి చర్యలను పోలీసులు కొనసాగించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..