Anita Chowdary: నటి అనితా చౌదరికి బురిడీ.. లక్షల్లో కొట్టేశారు..

కుమారుడి బర్త్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాలనుకున్న టాలీవుడ్ నటి అనితా చౌదరి సైబర్ మోసానికి గురయ్యారు. ఆన్‌లైన్‌లో విమాన టికెట్ల కోసం వెతుకుతున్న ఆమెను నకిలీ ట్రావెల్ సంస్థ ప్రతినిధి పేరుతో ఓ వ్యక్తి సంప్రదించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కథనంలో తెలుసుకుందాం ..

Anita Chowdary: నటి అనితా చౌదరికి బురిడీ.. లక్షల్లో కొట్టేశారు..
Anitha Chowdary

Edited By:

Updated on: Nov 18, 2026 | 1:42 PM

కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాలనుకున్న టాలీవుడ్‌ నటి అనితా చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. విమాన ప్రయాణం కోసం ఇంటర్నెట్‌లో వెతికిన ఆమెను సైబర్‌ ముఠా లక్ష్యంగా చేసుకుంది. ఫేక్ ట్రావెల్‌ సంస్థను నమ్మిన ఆమె నుంచి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు సేకరించి ఏకంగా రూ.4.14 లక్షలు మాయం చేసింది. టికెట్లు బుక్‌ కాకపోవడంతో అసలు విషయం తెలుసుకున్న నటి పోలీసులకు కంప్లైంట్ చేశారు.

వాషింగ్టన్‌ డీసీలో ఉంటున్న కుమారుడి బర్త్ డే వేడుకలకు హాజరయ్యేందుకు అనితా చౌదరి అమెరికా పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న బిజినెస్‌ క్లాస్‌ రిటర్న్‌ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశారు. ఈ సమయంలో ‘లో ఫ్లై ట్రావెల్స్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌’ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ ఆమెకు కనిపించింది. అందులోని సంప్రదింపు నంబర్‌కు ఫోన్‌ చేయడంతో రాజేశ్‌ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు.

ప్రయాణానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న అతడు టికెట్ల కోసం రూ.4,14,180 ఖర్చవుతుందని చెప్పాడు. బుకింగ్‌ ఫైనల్ చేయడానికి కార్డు సమాచారం ఇవ్వాలని కోరాడు. ఇందుకోసం ఓ ఫారం పంపించి అందులో డెబిట్‌ కార్డు వివరాలు నమోదు చేయించాడు. ఆ తర్వాత ఫోన్‌ కాల్‌ను కొనసాగిస్తూ మొబైల్‌కు వచ్చే ఓటీపీలను కూడా తెలుసుకున్నాడు. బుకింగ్‌ ప్రక్రియలో భాగమేనని నమ్మిన అనితా వాటిని అతడికి చెప్పడంతో మోసగాళ్లకు పని సులువైంది.

అయితే విమాన ప్రయాణానికి సంబంధించిన టికెట్లు రాకపోగా, ఆమె ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి. క్లియర్‌ట్రిప్‌ ద్వారా రూ.4,14,180 డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ రావడంతో అనితా చౌదరి అప్రమత్తమయ్యారు. బుకింగ్‌ ధ్రువీకరణ లేకపోవడం, ఖాతాలో నగదు తగ్గడంతో తాను సైబర్‌ మోసానికి గురైనట్లు నిర్ధారించుకున్నారు. ఆలస్యం చేయకుండా బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేసి, అనంతరం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. రాజేశ్‌ పేరుతో మాట్లాడిన వ్యక్తి ఆచూకీతో పాటు నకిలీ ట్రావెల్‌ సంస్థ కార్యకలాపాలు, డబ్బులు బదిలీ అయిన అకౌంట్ల వివరాలను సేకరిస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాల నేపథ్యంలో టికెట్ల బుకింగ్‌ విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వెబ్‌సైట్‌ క్రెడిబులిటీని పరిశీలించకుండా చెల్లింపులు చేయొద్దని, ఫోన్‌లో మాట్లాడే అపరిచితులకు బ్యాంకు కార్డు వివరాలు, ఓటీపీలు చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us